ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐవో, సీసీఐ, ఎన్‌ఐఏ తదితర సంస్థలున్నాయి. పీఎంఎల్‌ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం ఈ మేరకు మార్పులు చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారాన్ని అయినా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. విదేశాంగ శాఖ, ఎన్‌ఐఏతోపాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వలు జారీ చేసింది. దీంతో ఈడీ పరిధిలోకి మొత్తం 25 ఏజెన్సీలు వచ్చినట్లయ్యింది.
తాజాగా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చిన 15 సంస్థలు ఏఏయేవి అంటే… నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో), స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్, రెగ్యులేటర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ), మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎంక్వైయిరీ అథారిటీ అండర్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండ్ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఉన్నాయి.
ఈ సంస్థలన్నీ ఈడీ అడిగిన ఏ సమాచారాన్ని అయినా తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈడీ కేవలం 10 ఏజెన్సీల నుంచి మాత్రమే, అందులో సీబీఐ, ఆర్బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) తదితర సంస్థల నుంచి దర్యాప్తునకు అవసరమైన సమాచారం తీసుకునేది.