హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వెరిఫికేషన్ సహా ఇతర ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆరోగ్యక్ష పథకం అమలు, పురోగతిపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కేసులు పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి రావడం, ఆసుపత్రులలో సౌకర్యాలు పెరగడం, డీపీహెచ్ పరిధిలోని ఆసుపత్రులలోనూ ఆరోగ్యషీ సేవలు ప్రారంభించడం వల్ల ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందన్నారు. ఆరోగ్యశ్రీ బృందంతో పాటు ఆరోగ్య మిత్రలు చేస్తున్న కృషి కూడా ఇందులో ఉందనీ, ఇహెచ్‌ఎస్, జెహెచ్‌ఎస్ పథకాలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలనీ వెల్నెస్ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, డీఎంఈ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.