టిప్ విషయంలో కస్టమర్ తో గొడవపడి వెళ్లిపోయిన డెలివరీ గాళ్.. తన స్నేహితుడితో కలిసి తిరిగివచ్చి కస్టమర్ పై కత్తితో దాడి చేసింది. ఏకంగా పద్నాలుగు సార్లు కత్తితో పొడవడంతో ఓ గర్భిణి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరింది. కేవలం 2 డాలర్ల టిప్ ఇచ్చిందని డెలివరీ గాళ్ ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో ఓ కుటుంబం బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసుకుంది. వచ్చిన బంధువుల్లో ఒకరి కోసం పిజ్జా ఆర్డర్ చేయగా… బ్రియన్నా అల్వెలో అనే డెలివరీ గాళ్ పిజ్జా తీసుకొచ్చింది. బిల్లు 33 డాలర్లు కాగా 50 డాలర్ల నోటు ఇస్తే చిల్లర లేవని డెలివరీ గర్ల్ చెప్పింది. దీంతో ఆ మహిళ తన వద్ద ఉన్న చిల్లర వెతకగా 35 డాలర్లు అయ్యాయి. ఆ మొత్తాన్ని ఇవ్వగా… టిప్ గా కేవలం 2 డాలర్లేనా అంటూ అల్వెలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కొంత వాగ్వాదం జరిగిందని బాధితురాలి బంధువులు తెలిపారు.
చివరకు గొణుక్కుంటూనే అల్వెలో వెళ్లిపోయిందని, దాదాపు గంటన్నర తర్వాత మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చిందన్నారు. ఆ యువకుడి చేతిలో గన్, అల్వెలో చేతిలో కత్తి ఉన్నాయని చెప్పారు. వచ్చీ రావడంతోనే కత్తితో దాడి చేసిందని, గర్ణిణీని 14సార్లు పొడిచిందని వివరించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అల్వెలోను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.