న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 18 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కేటాయించగా, 2022 డిసెంబర్ నాటికి మొత్తం 14 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కార్యాకలాపాలు సాగిస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ మారగాని భరత్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (POCSO) చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో 17.64% కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని కేంద్ర మంత్రి వివరించారు. 2022లో మొత్తం 1.37 లక్షల కేసులకు న్యాయస్థానాల్లో పరిష్కారం లభించిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాలకు కేటాయించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో చాలావరకు ఏర్పాటవగా, ఇంకా మిగిలిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులను త్వరగా ఏర్పాటు చేయడంపై ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో గత నెల (జనవరి) 13న ఒక సమీక్ష నిర్వహించి, మిగతా 4 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్టు వెల్లడించారు. వీలైనంత త్వరగా దేశంలో మిగిలిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 218, మధ్యప్రదేశ్‌లో 67, కేరళలో 52, బిహార్‌లో 48 పనిచేస్తున్నాయి.