Saturday, November 23, 2024

ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగంలో 13,745 కోట్ల పెట్టుబడి.. విజయసాయి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంపై రూ. 13745 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2017-18 నుంచి ప్రారంభించిన ఈ పెట్టుబడులు 2022-23 వరకు కొనసాగుతాయని, గడచిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అనేక పునరుత్పాదక ఇంధన స్కీములు, కార్యక్రమాల అమలు కోసం కేంద్ర సాయం కింద రూ. 454 కోట్లు విడుదల చేశామని మంత్రి చెప్పారు. దేశంలో పవర్‌ గ్రిడ్‌తో అనుసంధానమైన సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో అత్యధికం ప్రైవేట్‌ డెవలపర్స్‌ అభివృద్ధి చేసినవేనని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు తమ మంత్రిత్వ శాఖ అయిదు సోలార్‌ పార్క్‌లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతపురంలో 1500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ పార్క్‌ దాదాపు పూర్తయ్యే దశలో ఉందని, అనంతపురం జిల్లాలోని ఎన్‌పీ కుంట, కడప జిల్లాలోని గాలివీడులో 9592 ఎకరాలలో ఇప్పటికే 1400 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయని వివరించారు. మరో 100 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌ డెవలపర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల్లో 1000 మెగా వాట్ల సామర్ధ్యంతో 5568 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ పార్క్‌ ప్రారంభమైనట్లు చెప్పారు. కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్ధ్యంతో 5600 ఎకరాలలో ప్రారంభించిన సోలార్‌ పార్క్‌ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అనంతరపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు, ఆలూరు గ్రామాల్లో 2751 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్క్‌కు సంబంధించి మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఇప్పటికే 400 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్స్‌లలో ఉత్పాదన ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని రామగిరి, ముత్తువకుంట్ల గ్రామాల్లో 200 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పుతున్న సోలార్‌, విండ్‌ హైబ్రీడ్‌ పార్క్‌కు సంబంధించి డీపీఆర్‌ను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం 690 ఎకరాల భూసేకరణ జరిగిందని, పార్క్‌లో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement