Friday, November 22, 2024

రెండేళ్లలో పీఎం కేర్స్‌కు 13,000 కోట్లు విరాళాలు.. 60 శాతం నిధులు కొవిడ్‌పై పోరాటానికి ఖర్చు

పీఎం-కేర్స్‌ ఫండ్‌ ఈ ఏడాది మార్చి నాటికి రూ.13 వేల కోట్లకు పైగా నిధులు పొందింది. మార్చి 31వ తేదీన దాదాపు రూ.5400 కోట్ల బ్యాలెన్స్‌ కలిగివుంది. మిగతా మొత్తం కొవిడ్‌పై పోరాటంలో వివిధ చర్యల కోసం ఖర్చు చేయబడ్డాయి. 2021-22కి సంబంధించి పీఎం-కేర్స్‌ ఫండ్‌ ఆడిట్‌ ప్రకటన ప్రకారం, మార్చి 2020లో ఫండ్‌ ప్రారంభించినప్పటి నుంచి రెండేళ్లలో రూ.13,000 కోట్లకు పైగా వసూలు చేయబడింది. ఈ మొత్తంలో 60శాతం అంటే దాదాపు రూ. 7700 కోట్లు మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆస్పత్రులకు వెంటిలేటర్లు, తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు వంటి వివిధ అంశాలపై ఖర్చు చేయడం జరిగింది.

దేశంలో మహమ్మారి విజృంభించిన మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో అందుకున్న విరాళాలు గణనీయంగా తగ్గాయి. 2020-21లో దేశీయంగా రూ.7,183 కోట్లు, విదేశాల నుంచి రూ.495 కోట్లు నిధులు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.1897 కోట్లు, విదేశాల నుంచి రూ41 కోట్లు మాత్రమే పీఎం-కేర్స్‌కు వచ్చాయి. ఈ ఫండ్‌కి ప్రారంభ కార్పస్‌ కింద ప్రధాని మోడీ తన వ్యక్తిగత సంపాదన నుంచి రూ.2.25 లక్షలు విరాళం ఇచ్చారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌ కార్పస్‌లో ఉన్న మొత్తం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయంగా రూ.160 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. 2020-21లో కూడా ఫండ్‌లోని కార్పస్‌పై పీఎం-కేర్స్‌ ఫండ్‌ అంతకు ముందు రూ.235 కోట్లను వడ్డీ రూపేనా పొందింది. దీని ప్రకారం గత మార్చి వరకు పీఎం-కేర్స్‌ ఫండ్‌లోకి వచ్చిన రూ.13,054 కోట్లలో వడ్డీ ఆదాయం రూ.395కోట్లుగా ఉన్నది.

వ్యయాలు..

  • ప్రభుత్వ ఆస్పత్రులకు 50 వేల వెంటిలేటర్లకు రూ.835 కోట్లు. మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1703 కోట్లు ఖర్చు చేశారు. 99,986 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల సేకరణకు దాదాపు రూ.500 కోట్లు, నాన్‌ రీబ్రీదర్‌ మాస్క్‌లు, 10 లక్షల అదనపు మాస్క్‌లతో కూడిన 1.5 లక్షల ఎస్‌పీఓ2 ఆధారిత ఆక్సిజన్‌ నియంత్రణ వ్యవస్థల సేకరణకు రూ.322 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్‌ ప్రకటన తెలిపింది.
  • పీఎం-కేర్స్‌ ఫండ్‌ నుండి కనీసం రూ.83 కోట్లు జమ్ము, శ్రీనగర్‌లలో రెండు 500 పడకల తాత్కాలిక కోవిడ్‌ ఆస్పత్రుల స్థాపనకు ఖర్చు చేయగా, యూపీలోని లక్నోలో 500 పడకల తాత్కాలిక ఆస్పత్రికి రూ.13 కోట్లు వెచ్చించారు.
  • పెట్రోలియం మంత్రిత్వశాఖ ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ద్రవ ఆక్సిజన్‌ పరికరాల కొనుగోలు కోసం దాదాపు రూ.190 కోట్లు ఖర్చు చేసింది. 2021-22లో ఢిల్లిdలోని 500 ఐసియు పడకల సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కొవిడ్‌ ఆస్పత్రిని తిరిగి సక్రియం చేయడానికి రూ.68 కోట్లు ఖర్చు చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement