Friday, November 22, 2024

Delhi | పోలవరం తొలిదశ పూర్తికి 12,911 కోట్లు.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ తొలిదశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 12,911 కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు 10 వేల 911.15 కోట్ల రూపాయలు.

వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని వ్యయ విభాగం గత జూన్‌ 5న తెలిపిందని పేర్కొన్నారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు. పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత జూన్‌ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించి మార్చి 15, 2022న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జూలై 15, 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మొత్తం రూ. 12,911 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి సమాధానంలో వివరించారు.

విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో కార్గో నిలిపివేత

విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో డొమెస్టిక్‌ ఎయిర్‌ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె సింగ్ స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ కార్గో రెగ్యులేటెడ్ ఏజెంట్ అభ్యర్థన మేరకు అవుట్ బౌండ్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. అలాగే అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కామన్ యూజర్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో టెర్మినల్ (సీయూడీసీటీ) కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తీసుకున్న నిర్ణయం కారణంగా విజయవాడ విమానాశ్రమంలో సైతం డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయన వివరించారు. విశాఖ విమానాశ్రయం నుంచి మాత్రం అన్ని కార్గో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. డొమెస్టిక్‌ ఎయిర్‌కార్గోను స్వయంగా హ్యాండిల్‌ చేస్తామంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సంస్థ ముందుకు వచ్చినందున దీనిపై ప్రతిపాదనలను సమర్పించవలసిందిగా బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ అధికారులను కోరినట్లు వి.కె.సింగ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement