Saturday, November 23, 2024

TS | అద్దె భవనాల్లోనే 12,221 అంగన్‌వాడీ కేంద్రాలు.. ‘యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌’ వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్ఠికాహారాన్ని అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కునారిల్లుతున్నాయి. ఉమెన్‌ డవలెప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఏటా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అద్దె భవనాలు, చాలీచాలని ఇరుకు గదుల్లోనే నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఇరుకు గదుల్లోనే చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, టీచర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

ఆ గదుల్లోనే పిల్లల ఆటవస్తువులు, వంట సామగ్రి, బియ్యం, పప్పు, గుడ్లు, బాలామృతం, పాలపాకెట్లు ఇతర సామాగ్రి భద్రపర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఆడుకోవాలన్నా, పాఠాలు నేర్చుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అంతా అక్కడే. గర్భిణీలకు, బాలింతలకు భోజనం వడ్డించేది కూడా అక్కడే. రాష్ట్రంలో కొన్ని కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తుంటే మరికొన్ని ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నడుస్తున్న కేంద్రాలకు కూడా సరైనా వసతులు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రాంతాల్లో ఉన్న అంగన్‌వాడీలను బలోపేతం చేస్తున్నామని, చిన్నారులకు, గర్భిణీలకు బలమైన పౌష్ఠికాహారాన్ని కూడా అందిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించారు, ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని ‘యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ’.. మహిళ, శిశు సంక్షేమ శాఖకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా అధికారులు కీలక సమాచారం అందించారు.

తెలంగాణలో మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు 35,700 ఉన్నాయి. ఇందులో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 31,711 కాగా, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలకు మెయింట్‌నెన్స్‌ కింద రూ. 2000 ఇస్తుండగా, మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.1000 ఇస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 12,221 అంగన్‌ వాడీ కేంద్రాలు ఇంకా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని మహిళ శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సమాచారం ఇచ్చారని యూత్‌ ఫర్‌ యాంటీ- కరప్షన్‌ పౌండర్‌ రాజేంద్ర తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు సూక్ష్మ పోషకాలతో ఫోర్టిఫైడ్‌ చేయబడిన రోస్ట్‌ గోధుమలు, వేయించిన శనగపప్పు, పాలపొడి, చెక్కర, ఆయిల్‌, మెత్తగా పొడి చేసిన ఎంటిఎఫ్‌ లేదా బాలామృతం అందిస్తున్నట్లు అధికారులు వివరాలు వెల్లడించారు. ఒక్కొక్క లబ్ధిదారునకు, ఒక్క రోజుకి 100 గ్రాముల చొప్పున 25 రోజులకు ప్రతినెల మొదటి రోజున రెండున్నర కిలోల ప్యాక్‌ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారానికి 4 చొప్పున నెలకి 16 గ్రుడ్లు ఇస్తున్నట్లు తెలిపారు. 3 సంవత్సరముల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజు (75 గ్రా బియ్యం, 15గ్రా పప్పు, 5గ్రా ఆయిల్‌, 25గ్రా కూరగాయలతో) వేడి భోజనం అందిస్తున్నారు.

ప్రతి రోజు 20 గ్రాముల స్నాక్స్‌, వారానికి 4 గ్రుడ్లు చొప్పున నెలకి 16 గ్రుడ్లు అందిస్తున్నారు. గర్బిణీ, బాలింతలకు ఒక సంపూర్ణ భోజనం పెడుతున్నట్లు తెలిపారు. సంపూర్ణ భోజనం అంటే 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల ఆయిల్‌, 50 గ్రాముల ఆకుకూరలతో పాటు 200 మి.లీ. పాలు, ఒక గ్రుడ్డు ప్రతిరోజు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇస్తున్నట్లు ఆర్టీఐ వివరాల్లో అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement