ప్రముఖ టెక్ సంస్థల మాదిరిగానే సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కూడా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12వేల మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. వ్యయాలను తగ్గించుకోవడం, ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఈమెయిల్ సందేశంలో పేర్కొన్నారు. రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్‌కు చెందిన విభాగాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ కోతలు ఉండనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని, అమెరికాలో సిబ్బందిపై వెంటనే ఈ ప్రభావం ఉంటుందని అల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి, తదుపరి ఉపాధి మార్గాల కోసం తమవంతు సహాయం అందిస్తామని భరోసా ఇచ్చింది.
ఆకర్షణీయ పరిహార ప్యాకేజీ..
అమెరికాలో ఉండే ఉద్యోగులకు 60 రోజుల పూర్తి నోటిఫికేషన్ కాలానికి వేతనం చెల్లించనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతోపాటు గూగుల్‌లో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లిస్తామని అన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2022కు సంబంధించి బోనస్‌తోపాటు వెకేషన్ టైమ్, ఆరు నెలలపాటు హెల్త్‌కేర్, జాబ్ ప్లేస్‌మెంట్ సర్వీసులు, ఇమ్మిగ్రేషన్ సపోర్టును అందించనున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఉన్నవారికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని పిచాయ్ స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం బాధాకరం..
25 ఏళ్ల ప్రస్థానం కలిగిన గూగుల్ ప్రస్తుతం సంక్లిష్ట ఆర్థిక వలయాల మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఈ క్రమంలో తమ ఫోకల్ వ్యయాల పునస్సమీక్ష వంటి చర్యలపై పెట్టాల్సి వస్తోంది. ఈ పరివర్తన ప్రక్రియలో కొంతమంది అద్భుతమైన ప్రతిభావంతులైన వ్యక్తులకు వీడ్కోలు చెప్పాల్సి వస్తున్నందుకు నేను చింతిస్తున్నాను. ఈ మార్పులు గూగ్లర్ల జీవితాలపై ప్రభావం చూపుతాయనే వాస్తవం నన్ను బాధిస్తోంది. ఇలాంటి నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నాను. గత రెండు సంవత్సరాలలో మేము నాటకీయ వృద్ధిని చూశాము. ఆ వృద్ధిని కొనసాగించేందుకు భిన్నమైన ఆర్థిక వాస్తవికత అవసరం. మా ఉత్పత్తులు, సేవల విలువ మా మిషన్‌కు బలం. సంస్థ అభవృద్ధిలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు అని సుందర్ పిచాయ్ తెలిపారు.