హర్యానాకు చెందిన ఓ బాలుడు తన అద్భుత ప్రతిభతో వార్తల్లో నిలిచాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ 12 ఏళ్ల ఈ బుడ్డోడు టెక్నాలజీలో మహామహులను మించిపోయాడు. ఏకంగా మూడు యాప్‌లను క్రియేట్ చేసి వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ గిన్నీస్‌లో చోటు సంపాదించాడు. ఆ చిన్నోడి విజయ రహస్యం ఏంటో చదవి తెలుసుకుందాం!
హర్యానా రాష్ట్రం జబ్బర్‌కి చెందిన కార్తికేయ అనే 12ఏండ్ల బాలుడు యాప్ డెవలపర్‌గా మారాడు. అతి తక్కువ వయసులో ఈ ఫీట్ సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. జజ్జర్‌లోని జవహర్ నవోదయ స్కూల్‌లో చదువుతున్న ఈ బుడ్డోడు యూట్యూబ్‌లో చూసి మూడు యాప్‌లను క్రియేట్ చేసినట్టు తెలిపాడు. యాప్ డెవలప్‌మెంట్‌పై ఈ చిన్నోడికి ఆసక్తి ఉన్న విషయం తల్లిదండ్రులకు తెలియదు. కానీ, కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం అతని తండ్రి స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. దీంతో ఫోన్‌తో ఆడుకుంటూనే దాని సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు మొదలెట్టాడు.
ఈ క్రమంలో తరుచుగా తలెత్తుతున్న కొన్ని ఇష్యూస్‌ని యూట్యూబ్‌లో చూసి పరిష్కరించేవాడు. ఇట్లా మొదలైన అతని ఇంట్రెస్ట్ కాస్త కోడింగ్ వంటి అంశాలను నేర్చుకునేలా చేసింది. తొలుత కోడింగ్ ప్రక్రియలో మొబైల్ ఫోన్ హ్యాంగ్ కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. యూట్యూబ్ సాయంతో మళ్లీ దాని సాఫ్ట్‌వేర్ సరిచేసి పనికొచ్చేలా చేశాడు.
ఇట్లా తొలుత ఒక యాప్ డెవలప్ చేశాడు. ఆన్‌లైన్‌లో జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన లూసెంట్ GK మొదటిది కాగా, రెండవది కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌ను బోధించే రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్.. ఇక మూడోది శ్రీ రామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే యాప్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ యాప్‌ల ద్వారా ఏకంగా 45 వేల మంది విద్యార్థులు ఉచిత శిక్షణ పొందుతున్నారు. దీంతో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బాలుడి టెక్నాలజీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.