రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది దుర్మరణంపాలైనారు. జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఎల్పీజీ ట్రక్, మరికొన్ని వాహనాలను ఢీకొనడంతో గ్యాస్ లీకైంది. వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
జైపూర్‌లోని భ్రంకోటా ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలొనే ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పెట్రోల్‌బంక్ వద్ద ఉన్న వాహనాలూ దగ్ధమైనాయి. ఈ ప్రమాదంలో 11మంది ప్రాణాలు కోల్పోగా 41మందికి తీవ్ర గాయాలైనాయి. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మంటలను అదుపుచేసేందుకు 20 అగ్నిమాపక వాహనాలు పనిచేస్తూండగా 25 అంబులెన్సుల్లో బాధితులను నగరంలోని జైపూర్ సవాస్ మాన్సింగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 40 వాహనాలు దగ్ధమైనాయని జిల్లా మెజిస్ట్రేట్ జితేంద్ర సోని తెలిపారు.
కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు.