Tuesday, November 26, 2024

11 రోజుల పాపకు కరోనా పాజిటివ్

క‌రోనా మహమ్మారి వల్ల కోట్ల మంది ప్రజలు సతమతం అవుతున్నారు. అయితే కరోనా వైరస్ ప‌సికందుల‌ను కూడా విడిచిపెట్ట‌డం లేదు. 11 రోజుల ప‌సికందుకు కూడా వైర‌స్ సోకింది. పుట్టిన ఐదో రోజే చిన్నారికి వైర‌స్ సోక‌టంతో త‌ల్లి నుండే వైర‌స్ సంక్రమించి ఉంటుంద‌ని వైద్యులు భావిస్తున్నారు. గుజ‌రాత్ రాష్ట్రంలోని అమ్రేలి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల గర్భిణిని ఏప్రిల్ 1న డెలివరీ కోసం డైమండ్ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు ఆమె శిశువుకు జన్మనిచ్చింది. కానీ పాప 5వ రోజే వైర‌స్ నిర్ధార‌ణ అయ్యింది.

ఆ శిశువు పుట్టిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యతో బాధపడిందని, ఈ సమస్యకు చికిత్స అందిస్తూ వచ్చామని వైద్యులు తెలిపారు. తల్లి ఆరోగ్యంగానే ఉండటంతో ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. ఆ శిశువుకు చికిత్సనందించే దశలో తల్లి పాలకు బదులు ఫార్ములా ఫీడ్ ఇచ్చామన్నారు. ఏప్రిల్ 5 నాటికి శిశువు ఆరోగ్యం కుదుటపడిందని, దీంతో తల్లిని పిలిపించి, ఆ శిశువుకు తల్లిపాలు ఇప్పించామన్నారు. ఏప్రిల్ 6న ఆ శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా, యాంటీజెన్ టెస్టు చేశామని పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింద‌ని వైద్యులు తెలిపారు. చిన్నారికి రెమిడెసివ‌ర్, ప్లాస్మా థెర‌పీ చేయ‌బోతున్నామ‌ని, శిశువు వైద్యానికి రెస్పాండ్ అవుతుంద‌ని డాక్టర్లు తెలిపారు. ‌

Advertisement

తాజా వార్తలు

Advertisement