Tuesday, November 19, 2024

11 కోట్లతో డెవలప్​మెంట్​ పనులు.. సిమెంటు పూసి బిల్లులు దొబ్బుతున్నారు..

కర్నూలు నగరపాలకం పరిధిలోని పలు వార్డుల్లో రూ.11కోట్లతో చేపట్టిన పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారనున్నాయి. నాణ్యతను గాలికి వదిలేసి 120 కాల్వల నిర్మాణ పనులను మమ అనిపిస్తున్నారని స్థానిక ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని ఇసుక, సిమెంట్‌తో పూతపూసి.. పనులు పూర్తయినట్లు చూపి బిల్లులు స్వాహా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో కాంట్రాక్టర్లకు.. ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కర్నూలు నగరపాలకంలో కాల్వల పనులు చేయకున్నా పైన పూతపూసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఇప్పటికే దిగమింగి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇంత జరుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై పర్యవేక్షించకపోవడం అనుమానాలకు బలం చేకూరుతోంది.

నగరంలోని 52 వార్డులలో 1055 కిలోమీటర్ల వరకు పక్కా 195 కిలోమీటర్ల మేర కచ్చా, 12 కిలోమీటర్ల వరకు పెద్దమురుగు కాల్వలు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని బాలాజీనగర్‌, సంతోష్‌నగర్‌, సీతాముఖర్జీ నగర్‌, ముజఫర్‌ నగర్‌, నంద్యాల చెక్‌పోస్టు, సి క్యాంప్‌, బి.క్యాంప్‌, దేవనగర్‌ ప్రాంతాల్లో మురుగు కాల్వలు అస్థవ్యస్థంగా ఉన్నాయి. గీతాముఖర్జీ నగర్‌లోని ఉమామాధవ పాఠశాల నుండి సంతోష్‌నగర్‌ ముఖద్వారం వరకు మురుగుకాల్వ ఏర్పాటుకు రూ.9.92లక్షలు కేటాయించారు. నాణ్యత లేని ఇసుక వాడటంతో పాటు సిమెంట్‌ పూతపూసి పనులు పూర్తయినట్లు బిల్లులు చేశారు. బాలాజీ నగర్‌లోని నర సింహ స్వామి ఆలయం సమీపంలో కాల్వ నిర్మాణానికి రూ.9.90 లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకుండాపోయింది. కొత్తపేటలోని రైతుబజార్‌ సమీపంలో కాల్వ పనులకు రూ.9.40 లక్షలు ఖర్చుచేశారు. ఎన్‌ఆర్‌ పేటలోని ఎస్‌పిజి కాంప్లెక్స్‌ వద్ద రూ.9.40 లక్షలతో సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల వీధిలోకాల్వ మరమ్మత్తులకు రూ.4.70లక్షలు ఖర్చుచేశారు. నగరంలో పలు వార్డులలో 120 కాల్వల నిర్మాణ మరమ్మత్తులకు సుమారు రూ.11కోట్లు కేటాయించారు. పనులు అస్థవ్యస్థంగా జరుగుతుండటంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement