Friday, November 22, 2024

భయంతో ఒకే తాటిపైకి ఏకమైన 11 అమెరికన్‌ బ్యాంక్‌లు.. మరో సంక్షోభం రాకుండా చర్యలు

అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. దీని వెంటే సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా పతనం కావడంతో ఈ భయం మరింత ఎక్కువైంది. ఐరోపాలోనూ క్రెడిట్‌ సూయిజ్‌ పతనం అంచుల్లోఉందన్న వార్తలు దీనికి తోడయ్యాయి. అమెరికాలో మరిన్ని బ్యాంక్‌లు సిలికాన్‌ వ్యాలీ, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల బాటలోనే ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. 2008లో లేమన్‌ బ్రదర్స్‌ స్థాయిలో సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న అనుమానాలు, అంచనాలతో అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో దిగ్గజ సంస్థలన్నీ ఒకే తాటికిపైకి వచ్చాయి. అమెరికాలో ఈ భయాల నేపథ్యంలో 11 ప్రముఖ బ్యాంక్‌లు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు నడుంభి గించాయి.

- Advertisement -

ఈ బ్యాంక్‌కు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. ఈ బ్యాంక్‌లోనూ సిలికాన్‌ బ్యాంక్‌ మాదిరిగానే టెక్‌ సంస్థలు, స్టార్టప్‌ సంస్థల డిపాజిట్లు, రుణాలే ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్‌ 31, 2022 నాటికి ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌లో 176.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థపై వస్తున్న వార్తలతో ఖాతాదారులు భారీగా నగదు ఉపసంహరించుకుంటున్నారు. దీని వల్ల ద్రవ్య లభ్యతపై ప్రభావం పడి, దివాలా తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే బడా బ్యాంక్‌లన్నీ కలిపి ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ ఆదుకోవాలని నిర్ణయించాయి. భారీ ప్యాకేజీ ప్రకటించాయి. అమెరికాను కుదిపేసిన 2008 ఆర్ధిక సంక్షోభం సమయంలోనూ బ్యాంక్‌లు ఇలానే ఏకతాటికిపై వచ్చాయి. బలహీనంగా ఉన్న బ్యాంక్‌లను ఆదుకునేందుకు ముందకు వచ్చాయి. అప్పటికే పరిస్థితి చేయిదాటి, పెను సంక్షోభానికి దారితీసింది. ఫస్ట్‌ రిపబ్లిక్‌లో చాలా మంది బిలియనీర్లు ఖాతాదారులుగా ఉన్నారు.

వీరికి బ్యాంక్‌ చాలా సులభమైన షరతులతో సేవలు అందిస్తోది. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఈ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. బ్యాంక్‌ గురించి వస్తున్న వార్తలతో గురువారం నాడు దీని షేరు ధర ఒక దశలో 36 శాతం పతనమైంది. బ్యాంక్‌లన్నీ కలిపి 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ ప్రకటించినట్లు వార్తలు రావడంతో తిరిగి పుంజుకుని చివరకు 10 శాతం లాభంతో ముగిసింది. ఫస్ట్‌ రిపబ్లిక్‌కు నిధులు సమకూరుస్తున్న వాటి జేపీ మోర్గాన్‌ చేజ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, సిటీ గ్రూప్‌, వెల్స్‌, ఫార్గో, మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మెన్‌ శాక్స్‌, బీ ఎన్‌వై మెలన్‌, స్టేట్‌ స్ట్రీట్‌, పీఎన్‌సీ బ్యాంక్‌, ట్రుయిస్ట్‌, యూఎస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. తామంతా ఒకే వేదికపై రావడం, అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో సూచిస్తోందన ఈ బ్యాంకులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement