కన్నకూతురు మరణించిందన్న బాధ పిండేస్తోంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మృతదేహాన్ని భుజంపై మోస్తూ ఓ తండ్రి పది కిలోమీటర్ల దూరం నడచివచ్చిన ఉదంతం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌లో జరిగిన ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూడగా… ఈ విషాదకర సంఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి డి.ఎస్.సింగ్ దేవ్ విచారణకు ఆదేశించారు. అవ్డూలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె సురేఖకు ఆరోగ్యం పాడవడంతో లఖన్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. అయితే చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని స్వగ్రామానికి కాలినడకన చేరుకున్నాడు. ఆస్పత్రినుంచి ఇంటికి మధ్య దూరం దాదాపు పది కిలోమీటర్లు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
ప్రజలనుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దీనిపై స్పందించిన వైద్యులు వివరణ ఇచ్చారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో మరణించిందని డాక్టర్ వినోద్ భార్గవ తెలిపారు. మృతదేహాన్ని తరలించేందుకు వాహనం వస్తుందని చెప్పామని, అంతవరకు వేచి ఉండకుండా అతడు మృతదేహాన్ని తీసుకువెళ్లాడని డా.భార్గవ చెప్పారు. కాగా జిల్లా కేంద్రం అంబికాపూర్ చేరుకున్న వైద్యఆరోగ్య మంత్రి సింగ్ దేవ్ విచారణకు ఆదేశించారు. జిల్లా ప్రధాన వైద్యాధికారిని దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...