కరోనా కాలంలో ఆర్థిక స్తోమత కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేట్ స్కూళ్లు మూతపడుతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణలో 1,036 ప్రైవేట్ స్కూళ్లు మూతపడినట్లు విద్యాశాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ జాబితాలో 2019 -2021లోనే అత్యధికంగా 742 ప్రైవేట్ పాఠశాలలకు శాశ్వతంగా తాళాలు పడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 300 ప్రైవేట్ స్కూళ్లు మూతబడ్డాయి. ఇందులో ఎక్కువగా సొంత భవనాలు లేనివే అధికంగా ఉన్నాయి.
హైదరాబాద్ తర్వాత మేడ్చల్‌లో 53, వరంగల్‌లో 50, ఖమ్మం జిల్లాలో 44 ప్రైవేట్ స్కూళ్లు మూతబడ్డాయి. ఇవన్నీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నవి కావడం గమనార్హం. రూరల్ ప్రాంతాలకు చెందిన పాఠశాలలకు ఈ స్థాయిలో సమస్య ఎదురుకాలేదు. వాస్తవానికి మూతబడిన స్కూళ్లలో చాలా యాజమాన్యాలు వాటిని కొనసాగించేందుకే ప్రయత్నించాయి. ఫీజులను కూడా తగ్గించాయి. కానీ తల్లిదండ్రులకు కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు లేకపోవడంతో వాటిని కూడా చెల్లించలేకపోయారు. కొన్ని చోట్ల ఈ స్కూళ్ల మూసివేత తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారింది. అర్ధాంతరంగా పాత స్కూల్‌ను క్లోజ్ చేయడంతో.. కొత్తగా మరో స్కూల్‌లో అడ్మిషన్ పొందేందుకు రెట్టింపు స్థాయిలో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది
ఈ వార్త కూడా చదవండి: రైతు వేదికలో టీఆర్ఎస్ నేతల మందుపార్టీ