Friday, November 22, 2024

వైద్యశాఖకు 101 జీవో దెబ్బ.. స్పెషల్‌ కాంపన్‌సేటరీ అలవెన్స్‌లు రాయొద్దని ట్రజరీ అధికారుల హుకుం

అమరావతి, ఆంధ్ర ప్రభ: వైద్యశాఖకు 101 జీవో దెబ్బ తగిలింది. జులై నుంచి స్పెషల్‌ కాంపన్‌సేటరీ అలవెన్స్‌లు రాయొద్దని ట్రజరీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్‌, హెచ్‌వీ క్యాడర్‌ ఉద్యోగులకు అడిషనల్‌ హెచ్‌ఆర్‌ఏ, దోబీ అలవెన్స్‌లు మంజూరు చేసే రూ. 2150 అలవెన్స్‌లు నిల్చిపోతాయి. వైద్యాధికారుల క్యాడర్‌లో రూ. 5 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడుతోంది. ఎవర్జెన్సీ హెల్త్‌ కేర్‌, ఎకనమిక్‌, రూరల్‌ ఎలవెన్స్‌లకు కొర్రీపడుతోంది. ప్రభుత్వం ఇటీ-వల 11వ పిఆర్సి( ఆర్‌. పి. ఎస్‌.2022) అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన స్పెషల్‌ అలవెన్సులు పెంచుతూ జీవో ఎంఎస్‌ నెంబర్‌ 101 తేదీ 11. 5 .2022 ద్వారా విడుదల చేసింది. కొన్ని అలవెన్స్‌లకు సంబంధించి నిర్ధుష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ట్రజరీ అధికారులు డిపార్ట్‌మెంట్‌ డ్రాయింగ్‌ ఆఫీసర్లు (డీడీఓ)లకు స్పెషల్‌ కాంపన్‌సేటరీ అలవెన్స్‌లు రాయొద్దని ఆదేశాలిచ్చారు. ”మీ పద్ధతిలో మీరు రాస్తే మేం అభ్యంతర పెడతాం. వ్రాతపూర్వకంగా అభ్యంతరాన్ని రాసి మీకు ఇస్తామని” తెగేసి చెబుతున్నారు. స్పెషల్‌ కాంపన్‌సేటరీ అలవెన్స్‌లు డ్రా చేసేశాక ప్రభుత్వం రికవరీ పెట్టమంటే ఉద్యోగులు ఇబ్బందులు పడతారని కాబట్టే వాటిని రాయొద్దని సబ్‌ట్రజరీ అధికారులు డీడీఓలకు సూచిస్తున్నారు. అలవెన్స్‌లు పెట్టాలా వద్దా ఆలోచించుకోండి అంటూ డీడీఓలు ఉద్యోగులకు ఫోన్‌ మెసేజ్‌లు చేస్తున్నారు. జీతాల బిల్లులు లేటయితే బ్యాంకు లోన్లు, ఈఎంఐలు ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు పడతారు కాబట్టి ఆలోచించుకోవాల్సిందిగా డీడీఏలు సూచిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక వైద్యశాఖ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 101 జీవో ప్రకారం వైద్య ఆరోగ్యశాఖలో ట్రావెలింగ్‌ , ఫిక్సిడ్‌ ట్రావెలింగ్‌ , మైలేజీ , యూనిఫాం , రిస్కు, రేషన్‌, రీడర్స్‌ అలవెన్స్‌ లను పెంచారు.పెరిగిన అలవెన్సులు పట్ల సంతోషపడాలో లేక బాధ పడా లో తెలియని పరిస్థితులలో పలు విభాగాల్లోని కొందరు క్యాడర్‌ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. యూనిఫామ్‌ అలవెన్స్‌ ఆరోగ్యశాఖలో రివైజ్డ్‌ పే స్కేల్స్‌ 2015లో రూ.2,250 సంవత్సరానికిగానూ మంజూరు చేశారు ఇప్పుడది రూ.3500 లకు పెరిగింది. వైద్య శాఖలో మెడికల్‌ ఎడ్యుకేషన్‌, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, ప్రివెంటివ్‌ మెడిసిన్‌, ఆయుష్‌ డిపార్ట్మెంట్‌ ఉన్నాయి ఆ శాఖల పరిధిలో యూనిఫామ్‌ అర్హత ఉన్న పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ క్యాడర్‌ ను పేర్కొన లేదు. అలాగే యూనిఫాం పొందుటకు అర్హత ఉన్న అన్ని శాఖల లోని కొన్ని పోస్టులు జీవోలో పేర్కొన లేదు . రేషన్‌ అలవెన్స్‌ స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌ కు అర్హత ఉన్నా హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌ నందు పేర్కొన లేదు. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ , ఆయుష్‌ డిపార్ట్మెంట్లలో లో మాత్రం పేర్కొన్నారు.

అయోమయంలో డీడీఓలు
ఈ ఆదేశాల ప్రకారం ఆరోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు ఎమర్జెన్సీ హెల్త్‌ కేర్‌ అలవెన్స్‌ 3000 , అకడమిక్‌ అలవెన్స్‌ 300 నర్సింగ్‌, హెల్త్‌ సూపర్వైజర్‌, ఏఎన్‌ఎం లకు అదనపు ఇంటి అద్దె అలవెన్స్‌ 2000, ధోబి అలవెన్స్‌ 150 రూపాయలు కూడా వ్రాయ వద్దని , కేవలం జీవో లో ఏ అలవెన్సులు అయితే పెంచుతూ ఇచ్చారో వాటిని మాత్రమే వ్రాయమని, 2015 పి.ఆర్‌.సి లో పేర్కొన్న అదనపు అలవెన్సులు వ్రాస్తే వారివారి జీవితముల బిల్లును తిప్పి పంపగల మని రాష్ట్రంలో నీ కొందరు ఖజానా అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్‌ డ్రాయింగ్‌ ఆఫీసర్స్‌ కు( డి డి ఓ) ఆదేశాలు ఇచ్చారు. పెంచిన అలవెన్సులు ఇవ్వడము సరైన విధానం కానీ జీవో లో ఎక్కడ కూడా ఎమర్జెన్సీ హెల్త్‌ కేర్‌ ఎలిమెంట్స్‌ కానీ, ఏ హెచ్‌ ఆర్‌ ఏ, దోబీ అలవెన్స్‌ లను రద్దు చేశామని పేర్కొనక పోయినా వాటిని రాయవద్దు అని చెప్పడంతో డ్రాయింగ్‌ ఆఫీసర్లు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు.

ఎందుకు నిలుపుదల చేస్తారు
మాకు వచ్చే అలవెన్సు నిలుపుదల చేసే అధికారం మీకు ఎక్కడ ఉంది? అంటూ పలువురు ఉద్యోగులు, యూనియన్‌ నాయకులు డ్రాయింగ్‌ ఆఫీసర్లతో వాదనకు దిగుతున్నారు. ఇందులో మేము చేసేది ఏమీ లేదు మీరు వెళ్లి -టె-జరీ అధికారులతో మాట్లాడుకోవాలని పలువురు డ్రాయింగ్‌ ఆఫీసర్లు ఉద్యోగులకు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగులలో పి ఆర్‌ సి వలన జీతాలు తగ్గాయి అనే భావన బలంగా ఉంది, ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం నుండి విడుదలైన జీవో ల లో ఎవరి ఇష్ట ప్రకారం వారు భావాలు తీస్తూ ఉద్యోగుల జీతాలతో చెలగాటం అడిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 101 జీవో స్పెషల్‌ కాంపన్‌సేటరీ అలవెన్స్‌లకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని వైద్యశాఖ ఉద్యోగులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement