కరోనా బాధితుల కోసం భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ తయారు చేసిన 2 డీజీ డ్రగ్ అందుబాటులోకి రాబోతోంది. కొవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. ఇప్పటికే రకరకాల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ మందు వారంలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్ ను విడుదల చేసింది. 10 వేల సాచెట్లు మొదటి బ్యాచ్ ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పొడి రూపంలో డ్రగ్‌ను నీళ్లలో కలుపుకొని తాగితే వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. 2-డీజీ ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమతి ఇచ్చింది.
ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని డీఆర్డీఓ పేర్కొంది. జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్ అనలాగ్ కావడం వల్ల దీని ఉత్పత్తి చాలా సులువని తెలిపింది. దీన్ని ఉపయోగించిన బాధితుల్లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనెగెటివ్‌గా తేలినట్లు డీఆర్డీఓ డీసీజీఐకి సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
2 డీజీ నీళ్లలో కలుపుకొని తాగే పౌడర్ కాబట్టి తీసుకోవడం తేలిక. ఈ డ్రగ్ తీసుకున్న పేషెంట్లలో రెండు మూడ్రోజుల్లోనే తేడా కనిపించిందని నిపుణులు అంటున్నారు. ‘ఒక పేషెంట్5 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే, 2 డీజీ తీసుకుంటే అది రెండు, మూడు రోజులకు తగ్గుతుంది’ అని డీఆర్డీవో డైరెక్టర్సతీశ్రెడ్డి తెలిపారు. అన్ని వయసుల వారికీ ఇది పనిచేస్తుందన్నారు. తమ ట్రయల్స్ లో 65 నుంచి 75 ఏళ్ల వాళ్లలోనూ మంచి ఫలితం కనిపించిందని చెప్పారు.
ఇది కూడా చదవండి : కేంద్రం కీలక నిర్ణయం.. మరిన్ని కంపెనీలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములా