భారత జీడీపీకి తమ వేదిక ద్వారా 2021లో రూ.10వేల కోట్ల ఆదాయం సమకూరిందని యూట్యూబ్ తెలిపింది. తమ వేదికపై కంటెంట్ క్రియేషన్ ద్వారా ఈ మొత్తం ప్రభుత్వానికి లాభించిందని పేర్కొంది. అదే సమయంలో 7.5 లక్షల మందికి ఉపాధి కూడా లభించిందని చెప్పింది. యూజర్ల లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు పరిచేలా కోర్సెస్ అనే కొత్త ప్రోడక్టును తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.
ఇంది కంటెంట్ క్రియేటర్లకు కొత్త మానిటైజ్ మార్గాలను చూపుతుందని, దీని బీటా వెర్షన్‌ను 2023లో ప్రవేశ పెడతామని వివరించింది. యూట్యూబ్ క్రియేటర్లు చేస్తున్న కంటెంట్‌ను భారత్‌సహా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగిస్తున్నారని, దీంతో క్రియేటర్లు తమ ఫ్యాషన్‌ను ఉపాధిగా మార్చుకునేందుకు ద్వారాలు తెరుచుకుంటున్నాయని పేర్కొంది.
మానిటైజేషన్ ద్వారా అనేక మంది లబ్దిపొందుతున్నట్లు తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పింది. భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లో 100కిపైగా ఆరోగ్య అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తామని యూట్యూబ్ వివరించింది. అలాగే ఒక కంటెంట్‌ను బహుళ భాషల్లోరూపొందించేలా తమ భాగస్వాములకు అవసరమైన సహకారం కూడా అందిస్తామని పేర్కొంది. వీక్షకులకు నిర్మాణాత్మకమైన, లోతైన అవగాహన కలిగించడం కోసం అర్హత కలిగిన క్రియేటర్లు ఉచిత లేదా రుసుములతో కూడిన కోర్సులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించొచ్చని తెలిపింది.