కరోనా టీకా భద్రతపై దేశంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా టీకా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయాలతో వ్యాక్సినేషన్‌కు వెనకాడుతున్నారు. అయితే వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని మరియపురం ప్రజలు మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తి(వయసు 45) టీకాలు వేసుకున్న తొలి గ్రామంగా మరియపురం నిలిచింది. గ్రామ సర్పంచ్ అల్లం బాలి రెడ్డి గ్రామ సభ్యులను ఏకం చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారు.
మరియపురం గ్రామంలో మొత్తం 800 మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 45 ఏళ్లు పైబడిన వ్యక్తులు 314 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ బాధ్యతను సర్పంచ్ బాలిరెడ్డి తీసుకున్నారు. వ్యాక్సిన్‌కు అర్హత ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించడానికి ఆయన వాలంటీర్లను నియమించారు. ఈ వివరాలతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కమ్యూనికేట్ చేయడంతో పాటు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ మేరకు గ్రామస్తులు ఒప్పుకోవడంతో రోజుకు 60 మంది చొప్పున టీకా తీసుకునేందుకు సర్పంచ్ రంగం సిద్ధం చేయించారు. దీని కోసం స్లాట్లు కేటాయించి వారిని టీకా కేంద్రానికి తీసుకెళ్లేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో తొలి డోస్ టీకాను అర్హత ఉన్న ప్రతిఒక్కరూ వేయించుకున్నారు. రెండో డోస్ టీకా కోసం గ్రామస్తులు వెయిట్ చేస్తున్నారు.