హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా విజృంభణతో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు ఆ తర్వాత నెమ్మదిగా రోడ్డెక్కాయి. పరిమితంగానే తిరుగుతూ సేవలు అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉండడం, విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో వందశాతం బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలో నేటి నుంచి హైదరాబాద్ పరిధిలో 1,286 ఆర్టీసీ బస్సులు, 265 బస్సులు కలిపి మొత్తంగా 1,551 బస్సులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే బస్సులకు శానిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు చెప్పారు. ప్రాంతీయ పరిధిలో 4.25 లక్షల కిలోమీటర్లు, 18,478 ట్రిప్పులు నడపనున్నట్టు హైదరాబాద్ రీజనల్ మేనేజర్ చెరుకుపల్లి వెంకన్న తెలిపారు.