న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సర్వే రిపోర్టుల పేరుతో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దమ్ముంటే తనపై, తన పాలనపై సర్వే చేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు చరమగీతం పాడుదామా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం యూటర్న్ తీసుకుని జగన్ మీదకే తిరిగి వస్తోందని వైఎస్ షర్మిలను ఉద్దేశించి అన్నారు. ఇలాంటి కోట్ల బాణాలు జగన్మోహన్ రెడ్డి మీద వదలడానికి ప్రజలు సిద్ధపడుతున్నారని భానుప్రకాశ్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నాలుగేళ్లలో ఏం చేశారో తెలియదా అని ప్రశ్నించారు. ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలందరికీ తెలుసు అని అన్నారు.
మాట తప్పను, మడమ తప్పను అంటూ అసెంబ్లీ వేదికగా చేసిన వాగ్దానాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. పెన్షన్లు, రైతు భరోసా వంటి పథకాలు కేంద్రం ఇస్తే.. వాటికి స్టిక్కర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒపీనియన్ సర్వే పేరుతో అభ్యర్థులను మార్చుతున్నారని, కానీ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. ఆయన అభ్యర్థులను మార్చాలని చూస్తుంటే ప్రజలు జగన్‌నే మార్చాలని చూస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో అవినీతి, ఆలస్యం ఎవరివల్ల జరుగుతోందో చెప్పాలని నిలదీశారు. జగన్ అరాచకాల వల్ల అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రం కాస్తా అంధకార ప్రదేశ్‌లా మారిపోయిందని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుని ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుని గాలిలో వచ్చి చూసి వెళ్ళిపోతున్నారని విమర్శించారు. మీడియా ప్రశ్నించినా, ప్రతిపక్షాలు ప్రశ్నించినా కేసులు పెట్టి ఆక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. బటన్ నొక్కడం మీకే కాదు.. మేం కూడా కూడా బటన్ నొక్కుతాం, నొక్కి మిమ్మల్ని గద్దె దించుతాం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు.
151 స్థానాలతో మీకు విజయం అందిస్తే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేది ఇంకో 100 రోజులు మాత్రమేనని, ఈ వంద రోజులు నిజాలు మాట్లాడి నిజాయితీగా పనిచేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కొంతైనా మీ పట్ల ప్రజలకు సానుభూతి ఏర్పడుతుందని అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జగన్మోహన్ రెడ్డితో ఏపీలో బీజేపీ పొత్తు అవకాశం కచ్చితంగా లేదని, జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి అన్ని రాష్ట్రాలతో ఎలాంటి సంబంధాలు ఉంటాయో అలాగే జగన్మోహన్ రెడ్డితో ఉంది తప్ప మరేమీ లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా బీజేపీతో పొత్తుల్లో లేనంటూ ప్రకటించలేదని, రాష్ట్రంలో జనసేన – బీజేపీ పొత్తు కొనసాగుతుందని తెలిపారు.