హైదరాబాద్, ఆంధ్రప్రభ : చిన్న చిన్న మొత్తాలను భారీ ఆదాయంగా మలచుకునేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. 100 రోజుల్లో రూ.200 కోట్ల ఆదాయం సముపార్జన లక్ష్యంగా రాష్ట్ర్రవ్యాప్తంగా డిపోలలో స్పేర్లలో ఉన్న బస్సులను రోడ్డెక్కిస్తోంది. ప్రత్యేక పథకాలతో పాటు అదనపు ఆదాయం కోసం ఉన్న వాటికి మార్పులు, చేర్పులు చేస్తోంది. మార్చి 23 నుంచి జూన్ 30 వరకు కొనసాగనున్న 100 రోజుల చాలెంజ్‌తో ఆర్టీసీ యాజమాన్యం కండక్లర్లు, డ్రైవర్ల ముందు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా ప్రతీ ట్రిప్పులో కనీసం నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు అదనంగా బస్సులు ఎక్కేలా డ్రైవర్లు చొరవ చూపాలి. రద్దీ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద అవసరమైతే రెండు నిమిషాల పాటు అదనంగా బస్సులు ఆపాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద ఆర్టీసీ పరిరక్షణ బృందాలు ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లేలా చూడాలి.
ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా ఎండ వేడిమికి ప్రజలు మద్యాహ్నం సమయాల్లో ఎవరూ ప్రయాణాలు చేయరు. దీంతో అనవసరంగా డీజిల్ ఖర్చు అవుతుందన్న ఉద్దేశ్యంతో టీఎస్ ఆర్టీసీ పగటి పూట బస్సు సర్వీసులను రద్దు చేసింది. వాటి స్థానంలో ఉదయం, రాత్రి వేళల్లో అదనపు ట్రిప్పులను నడుపుతోంది. మరోవైపు, గ్రామాలకు తిప్పే సర్వీసుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉండే సర్వీసులను గుర్తించి వాటిని ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలకు మళ్లిస్తోంది. అలాగే, శుభ కార్యాల సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండే రూట్లను గుర్తించి ట్రాఫిక్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ పాయింట్లలో గ్రౌండ్ బుకింగ్ కోసం కండక్టర్లను ప్రత్యేకంగా నియమించి బస్సులను కండక్టర్‌లెస్ సర్వీసులుగా తిప్పుతోంది.
ప్రతీ రోజూ కనీసం 70 వేల కి.మీ.ల బస్సులన్నీ కలిపి అదనంగా తిరగాలని కండక్టర్లు, డ్రైవర్లకు లక్ష్యంగా నిర్దేశించారు. ఇక, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్న టి-24 టికెట్ల ధరలను రూ.100 నుంచి 90కి ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. రూ.100తో కొనుగోలు చేస్తే 24 గంటల పాటు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో సర్వీసులలో ప్రయాణించే అవకాశం కల్పించిన ఆర్టీసీ టికెట్ ధర తగ్గించడానికి ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 25 వేల టికెట్ల విక్రయం జరిగేది. ఇప్పుడు ఆ ధరను రూ.90కి తగ్గించిన తరువాత టి-24 టికెట్ల విక్రయాలు భారీగా పెరిగాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.