లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని వెూడీ
విదేశీ పెట్టుబడులే లక్ష్యమని ప్రకటన
అంతర్జాతీయ స్థాయికి మౌలిక రంగం అభివృద్ధి
నిర్దిష్ట వ్యవధిలో ప్రాజెక్టుల పూర్తికి తోడ్పాటు
న్యూఢిల్లిస: దేశంలో బచహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన గతిశక్తి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. రూ.100 లక్షల కోట్లతో ఈ ప్రతిష్టాత్మక మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 1200 పారిశ్రామిక కారిడార్లను కలిపేలా ప్రణాళిక రూపొం దించారు. ఇందులో రెండు రక్షణ కారిడార్‌లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. రాబోయే 25ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దాదాపు 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశ మౌలిక వసతుల ముఖచిత్రమే సమూలంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నవతరం మౌలిక సదుపాయాలు దేశానికి పెట్టుబడులు తెస్తాయన్నారు. గతంలో కేవలం ఃపనులు జరుగుతున్నాయిః అనే బోర్డులు మాత్రమే చూశారని.. ప్రభుత్వ పనులు త్వరగా పూర్తికావని ప్రజలు భావించేవారని అన్నారు. కానీ, ప్రజల్లో అలాంటి అపనమ్మకాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందని ప్రధాని ఉద్ఘాటించారు. దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొంది స్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. జాతీయ మాస్టర్ ప్లాన్ విధానంతో 21వ శతాబ్ధపు అభివృద్ధి ప్రణాళికలకు గతిశక్తి లభిస్తుందని వెల్లడించారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలన్నా.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా.. ఉద్యోగ కల్పన చేయాలన్నా.. నాణ్యమైన మౌళిక సదుపాయాలు అవసరమని అన్నారు. ఢిల్లిసలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ కొత్త మోడల్‌ను కూడా ప్రధాని సమీక్షించారు. గతిశక్తి ప్రణాళికలో సుమారు 107 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దేశ స్వరూపాన్ని మార్చనున్నాయి. మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి, శాఖల మధ్య సమన్వయంతో గతిశక్తిని చేపట్టనున్నారు. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యాన్ని నివారించి మౌలిక వసతుల నిర్మాణాల్ని వేగంగా, సంపూర్ణంగా పూర్తిచేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. వీటి ద్వారా చేపట్టే ప్రాజెక్టులతో భవిష్యత్తులో మౌలిక వసతుల ముఖచిత్రమే మారనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఏమిటీ గతిశక్తి ప్రణాళిక
పీఎం గతిశక్తి ప్లాన్‌ను పంద్రాగస్టు ప్రసంగంలో మోడీ మొదటిసారి ప్రస్తావించారు. ఈ ప్రణాళిక మంత్రిత్వ శాఖల మధ్య సంక్లిష్టతలను తొలగించి, ప్రాజెక్టుల డిజైనింగ్, ప్లానింగ్‌ను సమీకృతం చేస్తుంది. మౌలికరంగం అభివృద్ధిలో ప్రపంచపోటీని ఎదుర్కొనేలా భారత్‌ను సన్నద్ధంచేస్తుంది. వస్తువులు, ప్రజా రవాణాను మరింత సరళతరం చేయడం ద్వారా సులభతర జీవనం, వ్యాపారానికి తోడ్పాటు లభిస్తుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా డిజిటల్ వేదికను ఏర్పాటుచేస్తారు. దీనికింద 16 మంత్రిత్వశాఖలను అనుసంధానం చేస్తారు. రహదారులు, రైల్వే శాఖ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. మౌలిక ప్రాజెక్టుల విషయంలో పరస్పర సహకారానికి ఈ వేదిక ఉపకరిస్తుంది. అత్యంత స్పష్టతతో కూడిన శాటిలైట్ ఫొటోలు , మౌలికవనరులు, పరిపాలన అనుమతులు, రవాణా, భూమి వంటి వాటిని డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సమకూర్చుతుంది.
ప్రణాళిక ముఖ్యోద్దేశం..
వాణిజ్య కారిడార్ల అనుసంధానానికి అవసరమైన బహుముఖ మౌలికరంగాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక ముఖ్యఉద్దేశం. గతి సే శక్తి అని దీనికి ట్యాగ్‌లైన్ జోడించారు. ఇప్పటికే వివిధ మంత్రిత్వశాఖల పరిధిలో కొనసాగుతున్న భారత్‌మాల, సాగరమాల, ఉడాన్, రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, జలమార్గాలు, భారత్‌నెట్ వంటి వన్నీ ఈ ప్రణాళికలో భాగం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధి లో (2024-25 లక్ష్యాలకు) పూర్తయ్యేందుకు ఇది దోహదం చేస్తుంది. 2 లక్షల కి.మీ. జాతీయ రహదారుల విస్తరణ, 200 విమానాశ్రయాలు, హెలిపోర్టుల నిర్మాణం, గ్యాస్‌పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను 35వేల కి.మీకి విస్తరించడం వంటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
అభివృద్ధికి కొత్త మంత్రం
అపూర్వమైన పనిని అందించడానికి అసాధారణ విధానమే ఈ గతిశక్తి. ప్లగ్ అండ్ ప్లే విధానంతో ప్రపంచస్థాయి మౌలికరంగం ఏర్పాటుకు సమీకృత విధానం రూపొందిస్తున్నాం. ఇలాంటి అంతర్జాతీయ మౌలికరంగం కోసం భారత్ నిరంతరాయంగా కృషిచేస్తున్నది. ప్రపంచ వాణిజ్య రాజధానిగా ఎదిగేందుకు ఇది మరింత సామర్థ్యాన్ని అందిస్తుంది. పురోగతికోసం సంకల్పం.. పురోగతి కోసం పని, పురోగతి కోసం సంపద, పురోగతి కోసం ప్రణాళిక, పురోగతి కోసం ప్రాధాన్యతలు అంటూ 21వ శతాబ్దానికి ప్రధాని మోడీ కొత్త మంత్రాన్ని ఇచ్చారు.
2024-25 నాటికి గతిశక్తి లక్ష్యాలు..
- 11 పారిశ్రామిక కారిడార్లు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో రెండు రక్షణ కారిడార్లు
- దేశంలోని అన్ని గ్రామాలకు 4జి నెట్‌వర్క్ అనుసంధానం
- పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 225 గిగావాట్ల నుంచి 877 గిగావాట్లకు పెంపు
- 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ
- ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ పరిధి 4,54,200 కి.మీ.కి పెంపు
- 220 ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులతోపాటు వాటర్ ఏరోడోమ్‌ల నిర్మాణం
- రైల్వే గూడ్స్ సామర్థ్యాన్ని 1600 మిలియన్ టన్నుల నుంచి 1210 మిలియన్ టన్నులకు చేర్చడం
- అదనంగా 17,000 కి.మీ. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు
- 202 ఫిషింగ్ కారిడార్లు/ హార్బర్లు / ల్యాండింగ్ సెంటర్లు
- 1.7 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీ
- 38 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలను ఏర్పాటు
- ఆరోగ్యవ్యవస్థను పటిష్టం చేసేందుకు 109 ఫార్మా క్లస్టర్లు