ఇస్లామాబాద్ – పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలనితీవ్రంగా ప్రయతిస్తున్న ఇమ్రాన్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఇప్పటికే అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించింది.. ఇక తాజాగా ఇమ్రాన్‌కు మరోషాక్ తగిలింది. తోషా ఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు బుధవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల శిక్షను విధించింది. అంతేగాక ఇద్దరూ పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు కూడా వేసింది. సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది.
కాగా, ఉన్నత పదవుల్లో ఉండే పాకిస్తాన్ ప్రముఖులు విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన అనంతరం వాటిని తోషఖానాకు అప్పగించాలి. లేదా సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి కొన్నింటిని సొంతం చేసుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాలో జమ చేయకుండానే విదేశాల్లోనే అమ్మేశారనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి ఇమ్రాన్ సొంతం చేసుకున్నారట. విచారణలో ఇమ్రాన్ సహా అతడి సతీమణి దోషులుగా తేలారు.
ఇమ్రాన్ ఖైదీగా ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో ఈ కేసు విచారణ జరిగింది. కాగా గత ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు. ఆయనపై వివిధ నేరాల కింద దాదాపు 100కుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం.