అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10మంది దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ జిల్లాలో రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై బగోదర గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
ఈ ప్రమాద మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కొందరు వ్యక్తులు బృందంగా సురేంద్రనగర్ జిల్లాలోని చోటిలా నుంచి అహ్మదాబాద్ వైపు మినీ ట్రక్కులో తిరిగి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు అహ్మదాబాద్ ఎస్పీ అమిత్ వాసావా తెలిపారు. ఈ ప్రమాదంలో మినీ ట్రక్కు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా, ప్రమాదవార్తపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని గుజరాత్ ముఖ్యమంత్రిని ఆదేశించారు..మృతుల కుటుంబాల ఒక్కొక్కరికి రూ 2 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు.