Tuesday, November 26, 2024

మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు..

సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్‌) లోని ఖాళీల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం గురువారం నుంచి అమల్లోకి వచ్చిన సరిహద్దు భద్రతా దళం, జనరల్‌ డ్యూటీ కేడర్‌ (నాన్‌ గెజిటెడ్‌) రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌, 2015ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. మార్చి 6న జారీ చేసిన నోటిఫికేషన్‌లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌లో మాజీ అగ్నివీరుల మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుందని, తదుపరి బ్యాచ్‌కు మూడేళ్ల వరకు వయో సడలింపు ఉంటుందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. నోటిఫికేషన్‌ ప్రకారం, మాజీ అగ్నివీరులకు కూడా ఫిజికల్‌ ఎఫిషియెన్స్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

గత సంవత్సరం జూన్‌లో అగ్నివీథ్‌ పథకం కింద, పదిహేడున్నర ఏళ్ల వయసు నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న వారు నాలుగేళ్ల పరిమితికి సైన్యంలో కొనసాగేలా కేంద్రం ప్రకటించింది. రిక్రూట్‌ అయిన వారిని అగ్నివీరులను పిలుస్తారు. ఎంపికైన వారిలో కేవలం 25 శాతం ఉద్యోగులే రెగ్యులర్‌ సర్వీసులో పని చేసేందుకు అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన ఈ పథకం దేశవ్యాప్తంగా పలు వివాదాలు, ఆందోళనలకు దారి తీసింది. పారమిలిటరీ దళాలు, అసోం రైఫిల్స్‌లో 10 శాతం ఉద్యోగాలు మాజీ అగ్నివీరులకు కేటాయిస్తారు. పారమిలిటరీ దళంలో రిక్రూట్‌ అవ్వడానికి కనీస వయసు 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి. గరిష్టి వయో పరిమితి అయిన 21 ఏళ్లలో అగ్నివీర్‌గా చేరిన వారికి మొదటి బ్యాచ్‌లో 30 ఏళ్ల వరకు, తదుపరి బ్యాచ్‌లకు 28 ఏళ్ల వరకు బీఎస్‌ఎఫ్‌లో రిక్రూట్‌మెంట్‌ అవుతారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement