- ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో దేశ వ్యాప్తంగా 225 గిగావాట్ల మేర విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అంచనాతో వేసింది. వేసవి తీవ్రతను అధిగమించేందుకు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న రాష్ట్రాలకు 4500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యాచరణ చేపట్టింది. అందుకు మధ్యకాలిక లేదా ఐదేళ్ల కొనుగోలు ఒప్పంద ప్రకారం ఏప్రిల్ నెల నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభించనుంది. ఇందుకు గాను ఇప్పటిఏకే కేంద్రం బిడ్లను ఆహ్వానించగా వివిధ రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 3910 మెగావాట్ల కరెంట్‌ను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి.
వీటిలో తమిళనాడు జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ 1500 మెగావాట్లు, న్యూఢిల్లిd మున్సిపల్ కార్పోరేషన్ 250 మెగావాట్లు, గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ 1000 మెగావాట్లు, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రబ్యూషన్ కంపెనీ 500 మెగావాట్లు, మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ 660 మెగావాట్ల మేర విద్యుత్‌ను సరఫరా చేయనున్నాయి. ఈ పథకంలో మరిన్ని రాష్ట్రాలు చేరే అవకాశం ఉన్నందున మొత్తంగా 4500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కేంద్రం ప్రాధాన్యతనిచ్చింది.
పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ( పీఎఫ్సీ) లిమిటెడ్‌కు చెందిన యాజమాన్యంలోని అనుబంధ సంస్థ పీఎఫ్సీ కన్సల్టింగ్ లిమిటెడ్‌ను నోడల్ ఎజెన్సీగా నియమించింది. ఈ సంస్థ డిమాండ్ అగ్రిగేటర్‌గా వ్యవహారిస్తూ టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయనున్నాయి. కాగా అర్హత పొందన ఆయా జెన్‌కోలకూ విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం అదనపు బొగ్గు కేటాయించనుంది. విద్యుత్ సరఫరా నిమిత్తం ఎంపికైన విద్యుత్ సంస్థలకు ఈ ఏడాదికి 27 మిలియన్ టన్నుల బొగ్గును కేటాయించాల్సిందిగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు కోరారు.
వేసవిలో అధిక డిమాండ్ కారణంగా ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయం ఉండకుండా చూసేందుకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరిపడా బొగ్గును అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకు బొగ్గు దిగుమతి చేసుకుని వాటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశబుూలు జారీ చేసింది. ఈ వేసవిలో దాదాపు 225 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా చేసినట్లు కేంద్ర విధ్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌లో రికార్డు స్థాయిలో 211.6 గిగావాట్ల వినియోగం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకుని దేశంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన జెన్కోలు.. అందుకు అవసరమైన బొగ్గును అందుబాటులోకి ఉంచుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే బ్లెండింగ్ (దిగుమతి చేసుకున్న బొగ్గు ) సెక్షన్ 11ను సైతం విధించనున్నట్లు తెలిపారు.
గత ఏడాది వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి జెన్కో సంస్థల్లో బొగ్గుకు తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు విద్యుత్ చట్టం సెక్షన్ 11 కింద కేంద్రం బొగ్గు దిగుమతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ బొగ్గుపై ఆధారపడిన అన్ని రాష్ట్రాలు , విద్యుత్ ఉత్పత్తి కంపెనీలైన జెన్కోలు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు దేశీయ బొగ్గుతో కలవడానికి తమ ఇంధన అవసరాల్లో కనీసం 10 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే దీన్ని తెలంగాణతో పాటు ఒకటి, రెండు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ విధంగానే ఈ వేసవిలో కూడా విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడి, పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు నిల్వలు లేకపోయినట్లయితే విధిగా విదేశీ బొగ్గును 10 శాతం దిగుమతి చేసుకునే ఆదేశాలు ఇచ్చేందుకు నిర్ణయించిట్లు కేంద్ర విద్యత్ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.