Monday, November 25, 2024

రక్షణశాఖలో 10 శాతం రిజర్వేషన్‌.. అగ్నివీరులకు కేంద్రం ఆఫర్‌

త్రివిధ దళాల్లో నాలుగేళ్ల కాలపరిమితితో అగ్నివీరులను నియమించే అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో వారిని శాంతింపచేసేందుకు కేంద్రప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరుల కోసం రక్షణశాఖలో పదిశాతం రిజర్వేషన్‌ను వర్తింప చేయనున్నట్లు రక్షణశాఖ మంత్రి శనివారం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాకు అదనంగా ఇది అమలు చేయనున్నామని వెల్లడించారు. సైన్యంలో చేరాలని కలలుగన్న లక్షలాది యువకులు అగ్నిపథ్‌ పథకం ప్రకటనతో తీవ్ర నిరాశకు గురై నాలుగు రోజులుగా ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. బీహార్‌, తెలంగాణలలో ఆందోళనలు హింసాత్మకంగానూ మారి పోలీసు కాల్పులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు, అధికారులతో మంత్రి రాజ్‌నాథ్‌ కీలక సమావేశం నిర్వహించి తాజా పరిస్థితులను సమీక్షించారు. అగ్నిపథ్‌ పథకంపై వెల్లువెత్తిన సందేహాలను నివృత్తి చేసేలా, అగ్నివీరులకు భరోసా కల్పిస్తూ రిజర్వేషన్లు సహా మరిన్ని రాయితీలు ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లను రక్షణశాఖ పరిథిలోని కోస్ట్‌గార్డ్‌, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్టులు సహా 16 రక్షణశాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయనున్నామని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. అలాగే, మర్చంట్‌ నేవీ, ఇండియన్‌ నేవీ పరిథిలోకి వచ్చే షిప్పింగ్‌ విభాగంసహా ఆరు రంగాల్లో అగ్నివీరులకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆయా విభాగాలు నియామక విధానాలను మార్చుకుంటాయని తెలిపారు. తాజా నిర్ణయాలను ఆయన ట్విట్టర్‌లో వివరించారు. అగ్నివీరుల నియామకానికి సంబంధించిన వయోపరిమితి సడలింపు సహా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

సీఎపీఎఫ్‌, అస్సామ్‌ రైఫిల్స్‌ విభాగాలతోపాటు పారా మిలటరీ నియామకాల్లోను అగ్నివీరులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లకు పెంచుతున్నట్లు ఇప్పటికే రక్షణశాఖ ప్రకటించింది. కాగా అగ్నివీరుల తొలి బ్యాచ్‌కు గరిష్ఠ వయోపరిమితిని ప్రకటించిన దానికన్నా అదనంగా ఐదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌, ఇండో టిబెటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), శాస్త్ర సీమ బల్‌ (ఎస్‌ఎస్‌బి), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లలో 73,219 వేల పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నట్లు హోంశాఖ వెబ్‌సైట్‌లో గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాక కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 18,124 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రక్షణశాఖలో సీఎపీఎఫ్‌ (సెంట్రల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌)లో సైనికుల సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు 10 లక్షలమంది ఆ విభాగంలో సేవలందిస్తున్నారు. అగ్నిపథ్‌ పథకం ప్రకారం పనిచేసే కాలం కేవలం నాలుగేళ్లే ఉండటం, కొందరినే కొనసాగించడం, పెన్షన్‌ వంటి సౌకర్యాలు లేకపోవడం వంటి వాటిపై సైన్యంలో చేరాలనుకుంటున్న అభ్యర్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. దాదాపు 8 ఎనిమిది రాష్ట్రాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, బీహార్‌లలో హింస చెలరేగింది. సికింద్రాబాద్‌ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌లో ఉపముఖ్యమంత్రి రేణుదేవి లక్ష్యంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement