Friday, November 22, 2024

మొండి బాకీలు 10 లక్షల కోట్లు రద్దు.. వెల్లడించిన ఆర్ధిక మంత్రి

ఐదు సంవత్సరాల్లో బ్యాంక్‌లు మొండి బాకీలు 10,09,511 కోట్ల రూపాయలను రద్దు చేశాయి. రాజ్యసభలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వివరాలు తెలిపారు. నాలుగు సంవత్సరాలు దాటిన మొండి బకాయిలను బ్యాంక్‌లు రైటాఫ్‌ పేరిట తమ బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తాయని తెలిపారు. రైటాఫ్‌ చేయడమంటే సాంకేతికంగా రద్దు చేసినట్లేనని, అయితే రుణాలను పూర్తిగా మాఫీ చేసినట్లు కాదని ఆర్ధిక మంత్రి వివరించారు. బ్యాంక్‌లు రైటాఫ్‌ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తుంటాయని, ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి సంబంధిత బ్యాంక్‌ బోర్డు ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.


రుణాలను రైటాఫ్‌ చేసినప్పటికీ వాటిని తీసుకున్న వారు వాటిని చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రైటాఫ్‌ వల్ల రుణాలు తీసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బ్యాంక్‌లు కూడా సివిల్‌ కోర్డుల్లో దావాలు వేయడం, రుణ రికవరీ ట్రిబ్యూనళ్లను ఆశ్రయించడం, దివాలా స్మృతి కింద కేసులు నమోదు చేయడం, నిరర్ధక ఆస్తుల విక్రయం వంటి ప్రక్రియల ద్వారా రుణాలను రికవరీ చేస్తున్నాయని ఆర్ధిక మంత్రి తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇలా రైటాఫ్‌ చేసిన రుణాల్లో 1,32,036 కోట్లు బ్యాంక్‌లు వసూలు చేశాయని, ఇలా మొత్తం ఇప్పటి వరకు 6,59,596 కోట్లు వసూలు చేసినట్లు నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

బ్యాంక్‌ల మొండి బాకీల విషయంలో ఆయా బ్యాంక్‌ అధికారులే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్‌పీఏలకు సంబంధించి 3,312 మంది బ్యాంక్‌ అధికారులను జవాబుదారీ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంకా కొన్ని బ్యాంక్‌లు మాత్రమే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని పరిమితంగానే వినియోగిస్తున్నాయని తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ బ్లాక్‌చైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ(ఐబీబీఐసీ) బ్యాంక్‌లకు డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ(డీఎల్‌టీ) సొల్యూషన్స్‌ను బ్యాంక్‌లకు అందిస్తోంది. బ్యాంక్‌ల్లో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది కృషి చేస్తున్నది. ఐబీబీఐసీలో 18 ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌లు భాగస్వాములుగా ఉన్నాయి.

- Advertisement -

బ్యాంక్‌ల్లో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించేందుకు కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దీని ద్వారా వివిధ రకాల స్కీమ్‌లు, సర్వీస్‌లను అందించేలా ఆర్బీఐ పర్యవేక్షిస్తోందని ఆర్ధిక మంత్రి వివరించారు. బ్యాంక్‌లు టెక్నాలజీ ఆధారిత సేవలను ప్రారంభించేందుకు ఐబీబీఐసీ ద్వారానే పరీ క్షించుకోవాల్సి ఉంటుంది. అన్ని బ్యాంక్‌లకు ఒకే విధమైన బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించాలన్న నిబంధన ఏదీ లేదని, దీనిపై మార్గదర్శకాలను కూడా జారీ చేయలేదని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement