Friday, November 22, 2024

చైనాలో రోజుకు 10 లక్షల కేసులు.. జనవరిలో మూడు రెట్లు పెరిగే అవకాశం

చైనాలో కొవిడ్‌ మహమ్మారి పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు వందల రెట్లు వ్యత్యాసం ఉంటోందని తాజా విశ్లేషణ ఒకటి పేర్కొంది. ప్రస్తుతం అక్కడ రోజుకు 10 లక్షల కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని, సగటున 5వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నారని అంచనా వేసింది. 140కోట్లకుపైగా జనాభా కలిగిన దేశంలో ఈ పరిస్థితి వచ్చే మూడు మాసాల్లో మరింత దిగజారవచ్చని కూడా హెచ్చరించింది. ప్రస్తుత వేవ్‌ ఇలాగే కొనసాగితే, జనవరిలో రోజువారి కేసుల రేటు 37 లక్షలకు పెరగవచ్చని, మార్చిలో ఇది 42 లక్షల స్థాయిని చేరుకోవచ్చని ఆరోగ్య విశ్లేషణలపై దృష్టిసారించే లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ స్పష్టంచేసింది.

ఈ సంస్థ కరోనా వైరస్‌ వ్యాప్తి, పరివర్తన క్రమాన్ని ఆవిర్భావం నుంచి నిశితంగా ట్రాక్‌ చేస్తోంది. ఇదిలావుండగా, చైనా ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2966 కొత్త కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ నెల మొత్తంలో కేవలం 10 మంది మాత్రమే మరణించారు. అయితే, ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయని, శ్మశాన వాటికలు వాటి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయనే ఇటీవలి కథనాలకు చైనా ప్రకటన పూర్తి భిన్నంగా ఉండటం విశేషం.

చైనా ప్రభుత్వం నివేదించే గణాంకాల విధానంలో మార్పుల కారణంగా వాస్తవాలు వెల్లడవడం లేదనే అభిప్రాయం ఉంది. చైనా తన విస్తారమైన మాస్‌ టెస్టింగ్‌ బూత్‌ల నెట్‌వర్క్‌ను చాలా వరకు మూసివేసింది. ప్రతి ఒక్క ఇన్‌ఫెక్షన్‌ను రోజువారి లెక్కల్లో చర్చే ప్రయత్నాలను రద్దుచేసింది. కొవిడ్‌ మరణాల నిర్వచనాన్ని కూడా కుదించారు. అనేక పాశ్చాత్య దేశాలు ఉపయోగించే విధానాలకు విరుద్ధంగా చైనా వ్యవహరిస్తున్నది. అందుచేత ప్రస్తుత అంటువ్యాధుల వ్యాప్తిని సహేతుకంగా అంచనా వేయడం కష్టతరం అవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా ప్రకటిస్తున్న అధికారిక డేటా, దేశంలోని పరిస్థితికి నిజమైన ప్రతిబింబం కాదని ఎయిర్‌ ఫినిటీ వ్యాక్సిన్లు, ఎపిడెమియాలజీ హెడ్‌ లూయిస్‌ బ్లెయిల్‌ ఒక ప్రకటనలోతెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement