అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఏప్రియల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌ఎస్‌సీ బోర్డ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇవ్వాల (శుక్రవారం) పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మీడియాకు విడుదల చేశారు. మొత్తం ఆరు సబ్జెక్టలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీబీఎస్‌ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్షల షెడ్యూల్ ఇదే..
3వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, 6వ తేదీ సెకండ్ లాంగ్వేజ్, 8వ తేదీ ఇంగ్లీష్, 10వ తేదీ గణితం, 13వ తేదీ సెన్స్, 15వ తేదీ సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే 17, 18వ తేదీల్లో ఒకేషనల్ కాంపోజిట్ కోర్సులకు సంబంధించిన ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలతో పాటు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డ్ ప్రకటించింది. 17వ తేదీ కాంపోజిట్ కోర్సులకు సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష, 18వ తేదీన ఓకేషనల్ కోర్సుకు సంబంధించి థియరీ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది.
9వ తేదీ వరకు ఫైన్‌తో దరఖాస్తులకు అవకాశం..
10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును కూడా ఎస్‌ఎస్‌సీ బోర్డ్ ప్రకటించింది. ఈ నెల 29 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో వచ్చే నెల అంటే జనవరి 3వ తేదీ వరకు రూ. 200 ఫైన్‌తో అలాగే 9వ తేదీ వరకు రూ. 500 ఫైన్‌తో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 6 లక్షల 60 వేల 859 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా వెల్లడించారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు రూ. 125 కన్నా అధికంగా పరీక్ష ఫీజు వసూలు చేసినట్లుగా తమకు ఫిర్యాదులు అందాయని దీనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.