Tuesday, November 26, 2024

వైద్య, ఆరోగ్యశాఖలోని 10, 028 పోస్టుల భర్తీ.. విడతల వారీగా నోటిఫికేషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంత్రి హరీష్‌రావు శుభవార్త చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో విడతల వారీగా వైద్య, ఆరోగ్యశాఖలోని 10028 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ముందుగా ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన 1326 పోస్టులకు నోటిఫికేషన్‌ రానుందని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మెడికల్‌ బోర్డును ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై సోమవారం మెడికల్‌ బోర్డు, ఆరోగ్య, ఆర్తికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో మొత్తం 1326 పోస్టులను మెడికల్‌ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్‌ నిబందనలను అనుసరించి నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 20శాతం వెయిటేజీ ఇవ్వాలన్నారు. ఆయుష్‌ విభాగంలోని పోస్టులను బోర్డు ద్వారానే భర్తీ చేయాలన్నారు. టెక్నికల్‌ పోస్టులతోపాటు ల్యాబ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, నిమ్స్‌ లోని ఖాళీలను నిమ్స్‌ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలని తేల్చి చెప్పారు.

ఆయూష్‌ విభాగంలోని స్టాఫ్‌ నర్సుల పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలన్నారు. ఇందుకు జీవో 34, 35ను సవరించాలన్నారు. స్టాఫ్‌ నర్సులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్దతిలో రాత పరీక్ష నిర్వహించాలన్నారు. కొవిడ్‌ కాలంలో పనిచేసిన వారికి 20శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్లలో ట్యూటర్స్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు ఉన్నాయన్నారు. ఎంబీబీఎస్‌ అర్హత గల ఈ పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్దతిఓల సేవలందిస్తున్న వారికి 20శాతం వెయిటేజీని, మిగతా 80శాతం మార్కులను ఎంబీబీఎస్‌ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. మొదటి విడతా 1326 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ఆ వెంటనే స్టాఫ్‌ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు.

ఆయూష్‌ వైద్యులను బోధనా సిబ్బందిగా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఏర్పడే ఖాళీలను వెంటనే నోటీఫికేషన్‌లో చేర్చాలన్నారు. ఆయూష్‌ సర్వీసు రూల్స్‌ లో సవరణలు చేయాలన్నారు. ప్రయివేటు ప్రాక్టీసును రద్దు చేస్తూ సవరణలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఎంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో పనిచేస్తున్న వారి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సీనియర్‌ రెసిడెంట్లు, హౌజ్‌ సర్జన్లకు కోట్ల రూపాయలను స్టైఫండ్‌గా ఇస్తున్నందున వారి సేవలను తగినవిధంగా వినియోగించుకునేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

కాగా… మంత్రి ఆదేశాల మేరకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్లను విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి తెలిపారు. సమీక్షలో ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్‌, డీఎంఈ డా. రమేష్‌రెడ్డి, డీహెచ్‌. శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, ఆయూష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాటరాక్టు ఆపరేషన్లను పెంచాలి..

- Advertisement -

అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్‌ ఆపరేషన్లను నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కంటి వైద్యులతో జూమ్‌ యాప్‌ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. కాటరాక్ట్‌ ఆపరేషన్ల నిర్వహణకు ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను వెంటనే సమకూర్చాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఇప్పటికే తగిన పరికరాలు, సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలని, మరింత ఎక్కువ మందికి పేషెంట్లకు ఆపరేషన్లు చేయాలని నిర్దేశించారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి, గుర్తించిన పేషెంట్లకు అవసరమైన చికిత్స అందించాలని, క్యాంపుల నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధుల స హకారం తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, సరోజినీ ఆసుపత్రి సూపరిండెంట్‌ డా. రాజలింగం, డీహెచ్‌ శ్రీనివాసరావు, జేడీ మోతీలాల్‌, జిల్లా ఆసుపత్రుల సూపరిండెంట్లు, ప్రొగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement