భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షా 64 వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బుధవారం నాడు వెల్లడించారు. సర్వీసుల ఆధునీకరణ, స్పెక్ట్రమ్ కేటాయింపు, గ్రామీణ ప్రాంతాల్లో 4జీ సేవలు అందించడం, ఫైబర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ బ్రాడ్‌బ్రాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్‌ఎల్)ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రి వర్గం ఆమోదించిందని మంత్రి వివరించారు. ఈ ప్యాకేజీలో 43,984 కోట్లు నగదుగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు సమకూర్చనున్నారు. 1.2 లక్షల కోట్లు నగదు రహిత మద్దతుగా ఉంటుంది. ఇది వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం సమకూర్చనుంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం 44,993 కోట్ల రూపాయల విలువైన 900/ 1800 మోగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 4జీ సేవలు అందించేందుకు వీలుగా ఈ స్పెక్ట్రమ్‌ను కేటాయించనున్నారు. పెట్టుబడి కింద ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 22,471 కోట్లు సమకూర్చనుంది. ఈ నిధులను 4జీ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు వినియోగించనున్నారు. 2014-15, 2019-20 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సేవలు అందించినందుకుగాను ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ క్రింద 13,789 కోట్లు కేటాయించనుంది. 33,404 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం ఈక్విటీగా మార్చనుంది.
దీంతో పాటు ఉన్న రుణాలను చెల్లించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ నిధుల సమీకరణకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వనుందని మంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరించారు. బీబీఎన్‌ఎల్ భారత్ నెట్ కోసం అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను, ఫైబర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఈ సంస్థను విలీనం చేస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్ జాతీయ సంపదగానే పరిగణిస్తామని, ఎలాంటి వివక్షలేకుండా అన్ని టెలికమ్ సంస్థలకు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 4జీ నెట్‌వర్క్ అందుబాటులోలేదని ఇలాంటి గ్రామాలకు బీఎస్‌ఎ న్‌ఎల్ ఈ సర్వీస్‌లను అందించేందుకు వీలుగా 26,316 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. 4జీ సేవలులేని 24,680 గ్రామాలకు ఈ పధకం ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకు వస్తారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో అన్ని గ్రామాల్లో 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.