Tuesday, November 19, 2024

శ్రీశైలం జలాశయానికి 1.05 లక్షల వరద – పోటెత్తుతున్న కృష్ణమ్మ

పశ్చిమ కనుమల్లోని కర్ణాటక. మహారాష్ట్ర పరిధిలో విస్తారంగా వర్షాలు కురవడంతో శ్రీశైల జలాశయంకి వరద నీరు పోటెత్తుతుంది. ముఖ్యంగా అలమట్టి,నారాయణపూర్, బీమా నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో తెలంగాణలోని జూరాల నుంచి సుమారు లక్షక్యూసెక్కులకు పైగా శ్రీశైలజలాశయం కు వరద ప్రవాహం సాగుతుంది. గురువారం ఉదయం అందిన సమాచారం మేరకు జూరాల నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, శ్రీశైల జలాశయం కు 88980 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, వరద ప్రవాహం తో 828.80 అడుగులకు చేరుకుంది. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిల గాను ప్రస్తుతం 48. 3290 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. అంటే ఒక్క రోజులో రెండు టీఎంసీల నీళ్లు పెరగడం గమనార్హం.

మలప్రభ, గట ప్రభ, తుంగభద్ర వంటి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా నదికి ఉపనదిగా ఉన్న తుంగభద్రకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా జలకళ ఉట్టిపడుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గాను, ప్రస్తుతం 1631.24 అడుగులుగా ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో లక్ష 14వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో జలాశయంలో 105 టీఎంసీల నిల్వలకు, ప్రస్తుతం 98.804 టిఎంసిల నీరు నిల్వ ఉండడం విశేషం. ఇదే క్రమంలో తుంగభద్ర జలాశయం నుంచి లక్ష 5వేల 248 క్యూసెక్కుల నీరు మొత్తం 30 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతుంది. వీటితోపాటు తుంగభద్ర కింద ఉన్న ఎల్ ఎల్ సి, హెచ్ ఎల్ సి ఇతర కాలువలకు నీరు విడుదలవుతుంది. విడుదలైన నీరు నేటి మధ్యాహ్నం, సాయంత్రం లోగా సుంకేసుల బ్యారేజ్ కు చేరే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement