Friday, September 20, 2024

హ్యాపీ బర్త్ డే కేసీఆర్ – హైదరాబాద్ : నాన్న వల్లే తెలంగాణ కల సాకారమైంది: కేటీఆర్

తాను పుట్టి.. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న కేసీఆర్‌గారు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. రోజు పూర్తిగా బిజీ బిజీగా గడిపేవారు. పొద్దున్నే తాము నిద్ర లేవకముందు బయటికివెళ్లి మళ్లి తాము పడుకున్న తర్వాత ఇంటికి వచ్చే వారు. తన రాజకీయ జీవితం ప్రభావం తమ మీద పడకుండా ఉండడానికి నన్ను ఎప్పుడూ హాస్టల్‌లోనే ఉంచి చదువు చెప్పించారు. స్కూల్‌, కాలేజీ అన్నీ ఇంటికి దూరంగా ఉండి హాస్టల్‌లోనే చదువుకున్నాను. తాము ఎప్పుడూ చదువు మీదే శ్రద్ధ పెట్టాలని కేసీఆర్‌ గారు భావించే వారు. అందుకు తగ్గట్టుగానే మేము కూడా రాజకీయాలను పెద్దగా పట్టించుకోకుండా చదువు మీదే పూర్తిగా శ్రద్ధ పెట్టే వాళ్లం. అప్పుడప్పుడు సెలవులకు ఇంటికి వచ్చినపుడు కూడా నాన్నగారితో గడిపే అవకాశం పెద్దగా దొరికేది కాదు. మాతో గడిపిన కొద్దిసేపు నాన్న గారు క్రమశిక్షణ, చదువు గురించే ఎక్కువగా మాట్లాడే వారు. పుణలో ఎమ్మెస్సీ చదివి ఎంబీఏ చేయడానికి అమెరికా వెళ్లిన తర్వాత నాన్న గారు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించారు. అనంతరం అనూహ్యంగా అమెరికాలో నేనే పనిచేసే కంపెనీ వారు హైదరాబాద్‌లో దక్షిణ ఆసియా కార్యకలాపాల కోసం కార్యాలయం ప్రారంభించారు. కొన్ని రోజులు హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో ఉద్యోగానికి వెళ్లిన తర్వాత నాన్నగారితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి సమయం కేటాయించాలనిపించింది. అంతటితో ఉద్యోగం మానేసి. పూర్తిగా తెలంగాణ ఉద్యమంలోకి రంగ ప్రవేశం చేశాను. అంతేగాని అందరూ అనుకున్నట్లుగా అమెరికాలో ఉద్యోగం మానేసో లేదా ఉద్యోగం పోయిన తర్వాతో హైదరాబాద్‌లో రాజకీయాల్లో ఎమ్మెల్యే అవడానికి రాలేదు. ఇన్నేళ్ల జీవితంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడి పరిపాలనలో నాన్న గారి నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి విషయం మీద సూక్ష్మంగా అవగాహన ఏర్పరుచుకోవడం, సామాన్యుని కోణంలో పాలసీలను తయారు చేసి అమలు చేయడం, ఏదైనా పని మొదలుపెడితే పూర్తయ్యేదాకా పట్టుదలతో కొనసాగించడం నాన్నగారి నుంచి నేర్చుకున్న ముఖ్యమైన లక్షణాలు. నాన్నగారు ఒక లెజెండ్‌. 2009లో తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్నపుడు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో మేమంతా చాలా టెన్షన్‌ పడ్డాం. ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రకటన చేయకపోయినా ముందు నాన్నగారి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నాం. అయితే ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంతో నాన్న ఆమరణ దీక్ష విరమించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాం. కేసీఆర్‌ గారు బతికి ఉంటెె చాలు తెలంగాణ ఎప్పటికైనా సాధించుకోవచ్చన్న నమ్మకం అప్పుడే మాకు కలిగింది. ఆ తర్వాత రాష్ట్రం సాధించుకొని, తెచ్చుకున్న రాష్ట్రానికి కేసీఆర్‌ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆయన సారథ్యంలో మంత్రిగా పనిచేయడంతో రాజకీయ నాయకుడిగా, ప్రజా జీవితంలో ఎలా ఉండాలన్న ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తెలంగాణ పట్ల కేసీఆర్‌ గారికి ఉన్న విజన్‌ కారణంగానే ప్రస్తుతం వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్నింటిలో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోంది. ఈ ఆరేళ్లలో దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ వృద్ధి ఎక్కువగా ఉండడమే టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ గారికి, మా అందరికీ తెలంగాణ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement