దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహ మ్మారి రెండో విడత విరుచుకుపడుతుండడంతో మరోసారి వైరస్ భరతం పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మరోమారు యాక్టివ్ చేశారు. సీనియర్ వైద్యాధికారులను ప్రత్యేకంగా నియమించి పరి స్థితులపై నిఘా ఉంచారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులపై నిరంతరం సమాచారం తెప్పించు కుంటున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల వద్ద వైద్య ఆరోగ్య శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. తెలంగాణ సరిహద్దుల్లో రహ దారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేకంగా కోవిడ్-19 టెస్టింగ్ కేంద్రాలను వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ప్రజలను అను మతిస్తున్నారు. పరిస్థితులను బట్టి చూస్తుంటే మహారాష్ట్రతో సరి హద్దులను మూసివేసినట్లు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండడంతో తెలంగాణలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. రాజస్థాన్, ఢిల్లిd, కేరళ, మహారాష్ట్ర, కేరళలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా… రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉందని వైద్య, ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా ఉండేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ గ్రామాలు, పట్టణాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహా కోవిడ్ వైరస్ ముప్పు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే అధికంగా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులుగా ఎక్కువ భాగం మహారాష్ట్రకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి నుంచి జిల్లాలోని చాలా ప్రాంతాలకు జనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో వైరస్ ముప్పు మనకు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ప్రజలు రోడ్డు మార్గాన నిరంతరం మహారాష్ట్రలోని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపార, వాణిజ్య అవసరాలతో పాటు కుటుంబపరమైన సంబంధాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో మెరుగైన వైద్య సేవలు అందించే ఆస్పత్రులు, ఇతర వ్యాపార సంబంధాలు కూడా పెద్దఎత్తున ఉండడంతో నిత్యం వేలాది మంది ఉమ్మడి జిల్లాకు వచ్చిపోతుంటారు. నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి భోకర్, నాందేడ్, ధర్మాబాద్ తదితర ప్రాంతాలకు సంబంధాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్‌కు మహారాష్ట్రలోని కిన్వట్, జైనథ్, బేల, ఆదిలాబాద్ ప్రాంతాలకు చంద్రాపూర్, యావత్మాల్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలతో రాకపోకలు ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చంద్రాపూర్, గడ్చిరౌలి జిల్లాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మహా కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement