తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా… ఎందుకంత ఘనవిజయం సాధిస్తుందన్నది ఆయన ప్రత్యర్థులకు సైతం అంతుపట్టదు. అది భారీ బహిరంగ సభైనా…లేదా పార్టీ కార్యకర్తల సమావేశమైనా… అధికారిక విందైనా. అది ఏదైనా… కేసీఆర్ నిర్వహించారంటే… కచ్చితంగా నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. ఈ విజయ రహస్యం ఏమిటన్నది రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ‘ఆంధ్రప్రభ’ పాఠకులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అదేంటో ఆయన మాటలలోనే తెలుసుకుందాం..
ఇంతకు ముందు చెప్పినట్లుగా నాకు కేసీఆర్ గారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అవి మాటలకందనివి. వర్ణనకు అతీతమైనవి. ఒక ప్రజా నాయకుని జీవితం పైకి కనపించినం తగా పూలబాట కాదు. దైనందిన కార్యక్రమాల్లో ఒకదాని వెంట ఒకటిగా సమావేశాలు ఉంటాయి. అవి ప్రభుత్వాధికారులతో కావచ్చు, ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడం కావచ్చు, వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిని సమీక్షించడం కావచ్చు, భవిష్యత్తుల్లో చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రణాళికా రచన కావచ్చు. ఇటువంటివి ఎన్నో ఉంటాయి. ఇవికాక మీడియాతో మాట్లాడడం ఉండనే ఉంటుంది.
ప్రజాసేవకునిగా కేసీఆర్‌గారి జీవితం ఇందుకు భిన్నం కాదు. ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచి, అసాధారణ క్రమశిక్షణతో వ్యవహరించే కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. నమ్మండి నమ్మకపొండి నిత్యం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు.. ప్రతి క్షణం ఒక ప్రణాళిక ప్రకారమే సాగుతుంది. ఒక విధంగా ఆటో పైలట్ వ్యవస్థ మాదిరి సాగుతుంది. ఆయన దినసరి కార్యక్రమాలకు ఎటువంటి అవరోధాలు ఉండవు. ప్రశ్నలు ఉదయించవు.
ఇన్నేళ్ళ తరువాత కూడా ఆయన దార్శనికత, పనుల నిర్వహణలో ప్రణాళికా రచన ఊహాతీతం అనిపిస్తుంది.
పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనే టీఆర్‌ఎస్ సమావేశాలను పార్టీ సీనియర్ నాయకులు, లేదా పార్టీ కమిటీలు మాత్రమే ముందుగా నిర్ణయిస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ.. అది వాస్తవం కాదు. ప్రతి సమావేశానికి సంబంధించిన అన్ని అంశాలను కేసీఆర్ గారే స్వయంగా పర్యవేక్షిస్తారు. సమావేశ నిర్వహణ ప్రణాళికలు రూపొందిస్తారు. సమావేశంతో ప్రమేయం ఉన్న నాయకులతో ప్రతి అంశంపైనా సవివరంగా చర్చిస్తారు.
ఒక సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల స్థలంలో దానిని నిర్వహిస్తారు. అక్కడ పార్కింగ్ సౌకర్యం ఏ మేరకు ఉంది. వచ్చే వారికి అక్కడికి రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం ఏర్పడిన సందర్భంలో అక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయించేందుకు గల అవకాశాలు వంటి వాటి గురించి ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసి దానిపై పార్టీ నాయకులతో చర్చిస్తారు. చివరకు సమావేశంలో వేదిక ఏ విధంగా ఉంగాలి, దాని ఎత్తు ఎంత, కూర్చునే వారికి ఏర్పాట్లు, అక్కడ ప్రసంగాల శబ్ధం ఏ స్థాయిలో ఉండాలి వంటి వాటనన్నిటనీ ఆయన ఆమోదించవలసి ఉంటుంది.
వీటికి సంబంధించిన వివరాలన్నీ ఆయన ఒక పుస్తకంలో రాసుకుంటారు. ఆ ఏర్పాట్లు చేసే వారితో వ్యక్తిగతంగా గాని ఫోనులో గాని మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయో తెలుసుకుంటూ ఉంటారు. అవన్నీ ఆయన స్వయంగా చేయడమే చూశాను గాని ఇతరులకు అప్పగించటం ఎప్పుడూ చూడలేదు.
ప్రణాళికా రచన సరిగా ఉంటే పని 50 శాతం విజయవంతమైనట్లేనని ఆయన మాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. నాకు దానిపై పూర్తి నమ్మకం ఉంది. అయితే ఈ ప్రణాళికా రచన అక్కడితో ఆగిపోదు.
కేసీఆర్ అనుభవమున్న వక్త. ఆయన ఏ విషయం గురించైనా వివరాలు సేకరించి, వాస్త వాలు తెలుసుకుంటారు. అన్ని విషయాలు ఆకళింపు చేసుకుని ఉంటారు. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు నిపుణుల నుంచి వివరాలు తెలుసుకోవడం, తన వద్ద్దకు వచ్చిన సమాచారాన్ని తరచి చూసి, సమావేశానికి ముందు వాటిని రాసుకోవడం చేస్తారు.
ఆ తరువాత ఆయన ప్రజలనుద్దేశించిగాని, మీడియాతో గాని మాట్లాడేప్పుడు అవాస్తవాలను ఎండగట్టడం, కఠిన వాస్తవాలను వెల్లడించడంలో ఎటువంటి తొట్రుపాటుకు గురికాకపోవడం చూసినప్పుడు మీకు నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. జీవితంలోని ప్రతి విషయానికి సంబంధించి ఆయన చూపే అసక్తి పార్టీకి, పాలనకు మాత్రమే పరిమితమైనది కాదు.
ఇదే విధానాన్ని ఆయన ప్రముఖులకు విందు ఏర్పాటు చేసినప్పుడు, వారితో చర్చించేటప్పుడు కూడా కనబరుస్తారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ విందుకు సిద్ధం చేయాల్సిన వంటకాలు కూడా ఆయనే నిర్ణయిస్తారు. వడ్డన, ప్రముఖులనుంచి, డ్రైవర్లు, గన్ మెన్, సాధారణ పార్టీ కార్యకర్తల వరకూ అందరూ తృప్తిగా భోజనం చేసిందీ లేనిదీ ఆయన అడిగి తెలుసుకుంటారు. ఇన్నేళ్లుగా ఆయన సమావేశాలకు వచ్చిన కార్యకర్తలందరూ తమ గమ్యస్థానాలకు చేరుకున్నాకే నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు, ఆ కారణంగా మరణాలు సంభవించినప్పుడు వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందజేయడం వంటివి స్వయంగా పర్యవేక్షిస్తారు. వారికి రక్షణ కల్పించడం వంటివి చూస్తారు. నాతో సహా ఆయనను అనుసరించే అనేకానేక మందికి ఆయన దార్శనికత, ప్రణాళికా రచన, వాటి నిర్వహణ వంటివే ముందుకు తీసికెళ్లే కరదీపికలు.