Friday, November 22, 2024

హైదరాబాద్ : కష్టాలకు సాదా‘బై’నామా!

కొన్నేళ్లుగా భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకోకుండా ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి తెలంగాణ సర్కార్‌ వెలుగులు ప్రసాదిస్తున్నది. ఈ మేరకు సాదాబైనామాల క్రమబద్దీకరణకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. త్వరలో సాదాబైనామాలకు చట్టబద్దత కల్పించే లక్ష్యంతో త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ దిశలో ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ సమీక్షించి తుది రూపం ఇవ్వనున్నారని సమాచారం. ధరణి రాకతో తీరిన కష్టాలకు తోడుగా, పాత పెండింగ్‌ మ్యుటేషన్లు, పెండింగ్‌ పాస్‌ పుస్తకాల సమస్యలు తీర్చేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే సాదాబైనామాలకు సీఎం కేసీఆర్‌ ఎవరూ అడగకముందే తనంతతానుగా సమస్య తీర్చాలని యోచించారు. అందుకు అనుగుణంగా అసెంబ్లిd వేదికగా ప్రకటన చేశారు. వెంటనే దరఖాస్తులు స్వీకరించి పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించాలని సంకల్పించారు. బాండ్‌ పేపర్లు, తెల్లకాగితాలు, నోటరీలపై జరిగిన క్రయవిక్రయాలకు చట్టబద్దత కల్పించి యాజమాన్య హక్కుల కల్పనకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జారీ చేసిన ఆదేశాల మేరకు మీ సేవల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. గడువులోగా వచ్చిన 9లక్షలకుపైగా దరఖాస్తుల్లో వడపోత చేపట్టారు. గతేడాది అక్టోబర్‌ 21నుంచి నవంబర్‌ 10 వరకు 20 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఆన్‌లైన్‌లో ఈ సందర్భంగా 9,00,896 మంది దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,11,449మంది, సూర్యాపేటలో 81,629మంది దరఖాస్తులు చేశారు. అతి తక్కువగా మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 1332 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో దరఖాస్తుకు నామమాత్రంగా కేవలం రూ. 45 యూజర్‌ చార్జీలుగా ప్రభుత్వం వసూలు చేసింది.
ఉమ్మడి జిల్లా దరఖాస్తులు
ఆదిలాబాద్‌ 45393
ఖమ్మం 1,73,960
కరీంనగర్‌ 1,12,520
మహబూబ్‌నగర్‌ 29,093
నిజామాబాద్‌ 36,817
మెదక్‌ 70,264
నల్గొండ 1,25,939
రంగారెడ్డి 11,316
వరంగల్‌ 2,95,594
మొత్తం 9,00,896
సాదాబైనామాల వ్యవహారం చక్కబెట్టడంలో అవినీతి అడ్డుగా నిలుస్తోంది. గత 60 ఏళ్లుగా తెలంగాణలో పేరుకుపోయిన తెల్లకాగితాలపై భూముల క్రయవిక్రయాలకు చివరి విడతగా మోక్షం కలిగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ ఇంకా తుది దశకు చేరలేదు. దీంతో వీలైనంత తొందర్లో ఈ ప్రక్రియ ముగించాలని ఆయన తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు సిద్దం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అయితే పాత రెవెన్యూ చట్టంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే సాదా బైనామాలను క్రమబద్దీకరించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. 2016లో ప్రభుత్వం ప్రకటించిన సాదా బైనామాల క్రమబద్దీకరణకు 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిబంధనల మేరకు సరిగ్గా ఉన్న 6.18లక్షల దరఖాస్తులకు చెందిన 2 లక్షల ఎకరాలకు పైగా భూములను క్రమబద్దీకరించారు. నిబంధనల ప్రకారం లేని 4.19లక్షల దరఖాస్తులను తిరస్కరించారు.
తాజాగా 2020 అక్టోబర్‌ 12న ప్రభుత్వం చివరి విడత క్రమబద్దీకరణ పథకాన్ని ప్రకటించింది. అదే నెల చివరి గడవుగా పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత నవంబర్‌ 10వరకు పొడిగింపునిచ్చారు. సాదా బైనామాలకు ఆర్వోఆర్‌ చట్టం 1971 ప్రకారం రూల్‌ 1989లోని రూల్‌ 22 ప్రకారం ఫారం 10లో దరఖాస్తు చేసుకున్న వారికి 13బి ధృవీకరణ పత్రంతో చట్టబద్దత కల్పించాలని ఉంది. కొత్త చట్టంలో సాదా బైనామాలకు అవకాశం లేకపోవడంతో నూతనంగా మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. ఈ దఫా అక్టోబర్‌ 29నాటికి దాదాపు 2.26 లక్షల దరఖాస్తులు క్రమబద్దీకరణ కోసం వచ్చాయి. తర్వాత గడువు పెంపుతో మరో 6.74 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. దీంతో పాత చట్టం ప్రకారం అక్టోబర్‌ 29నాటికి వచ్చిన వాటినే గుర్తించి క్రమబద్దీకరణకు పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వారసత్వ హక్కుల ప్రకారం యాజమాన్య హక్కుల పేరు మార్పిడి( ఫౌతీ) అమలు చేసే విషయంలో 10 రోజుల గరిష్ట వ్యవధి పెట్టుకోవాలని ఆదేశించారు. దరఖాస్తు వచ్చిన 10 రోజుల్లోగా యాజమాన్య హక్కు ఖాతాలో పేరు మార్పిడి చేసి 11వ రోజున కలెక్టర్‌కు వివరాలు పంపాలని నిర్ధేశించారు. ఈ విషయంలో దరఖాస్తు సమయంలోనే అభ్యంతరాలను తెలపాలని, విషయ పరిజ్ఞానం లేనివాళ్లకు, నిరక్ష్యరాస్యులకు అవగాహన కల్పించాలని, డబ్బులు తీసుకోకుండా పారదర్శకంగా మ్యుటేషన్‌ ప్రక్రియ ముగించాలని ఆయన ఆదేశించి ఏడాది గడిచినా ఇంకా కొలిక్కి రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement