Friday, November 22, 2024

హైదరాబాద్‌ : బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం

ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. పోలీసు సైరన్‌ వినిపించడంతో ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివ‌రాల‌లోకి వెళితే, రాంపల్లికి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. కాలేజీకి వెళ్లి తిరిగి వెళ్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. అయితే కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా డ్రైవర్‌ ముందుకు తీసుకెళ్లాడు. బాధితురాలు తన తల్లికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశారు. కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. సైరన్‌ విన్పించడంతో పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌ దగ్గర ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని పోలీసులు వారి వాహనంలోనే జోడిమెట్లలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఆమెను ఆటో లో కిడ్నాప్ చేసిన తర్వాత మారుతీ వ్యాన్ లోకి ఎక్కించిన దుండగులు పొదల్లోకి తీసుకు వెళ్ళారు దుండగులు. అనంతరం పొదల్లో కర్రలు , రాడ్లతో ఫార్మసీ స్టూడెంట్ ఫై విచక్షణ రహితం గా దాడి చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే ఆటో , ఆటో డ్రైవర్ ను రాచకొండ పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలో అత్యాచార ప్రయత్నం జరిగిందని, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో విద్యార్థిని అక్కడ వదిలేసి పారి పోయారని చెబుతున్నారు. బాధిత విద్యార్థిని, వైద్యులు ఇచ్చే సమాచారంతో అసలు విషయం బయటకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement