Tuesday, November 26, 2024

‘శ్రీదేవి’ 3వ వర్థంతి..మరోసారి స్మరించుకుందాం..

అతిలోక సుందరి అంటే ఈమెనే అనిపించే రూపం..మంచితనానికి మరో పేరు..ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే తత్వం..తోటీ నటీనటులతోనే కాదు దర్శకులందరితో శభాష్ అనిపించుకున్నారామె. ఆమె ఎవరో కాదు దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి. అందరూ హీరోల కోసం ఎదురు చూస్తే..శ్రీదేవి విషయంలో మాత్రం ఆమె కోసం ఎదురుచూసేవారట దర్శక..నిర్మాతలు. ఆమె డేట్స్ కోసం సినిమాలనే వాయిదా వేసుకునేవారట. ఆమె మనల్ని విడిచి అప్పుడే మూడు సంవత్సరాలు అయిందంటే నమ్మశక్యం కాదేమో. ఫిబ్రవరి 24న ఆమె మూడవ వర్థంతి. తమిళనాడులో జన్మించారు. 1963 ఆగస్టు 13న శివకాశి ప్రాంతంలో పుట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. శ్రీదేవికి నాలుగేళ్ల వయసులో నే సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘కందన్ కరుణయ్’ అనే తమిళ సినిమాలో ఆమె బాలనటిగా నటించారు. ఆ తర్వాత.. పదేళ్లకే సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. యుక్తవయసు వచ్చే నాటికి బీజీ హీరోయిన్ గా మారిపోయింది.1976లో హీరోయిన్ గా తొలి సినిమా చేసింది శ్రీదేవి. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముంద్రముదచ్చు’ మూవీలో రజనీకాంత్ కమల్ హాసన్ సరసన నటించింది. ఈ సినిమాలో శ్రీదేవి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే.. తమిళనాట కమల్ హాసన్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు శ్రీదేవి. వీరి జోడి హిట్ పెయిర్ గా నిలిచింది. ఆ విధంగా 1975-85 ప్రాంతంలో తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఎన్టీఆర్ తో వేటగాడు బొబ్బిలిపులి కొండవీటి సింహం సర్దార్ పాపారాయుడు ఏఎన్ ఆర్ తో  ప్రేమాభిషేకం ముద్దుల కొడుకు బంగారు కానుక శ్రీరంగ నీతులు చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి ఎస్పీ పరశురాం నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’ వెంకటేష్ తో ‘క్షణక్షణం’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది శ్రీదేవి. తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన శ్రీదేవి.. అక్కడ కూడా జెండా పాతింది. నవరసాలను కళ్లతోనే పలికించగల అరుదైన నటి శ్రీదేవి. ఆమె అభినయ కౌశలం ముందు అన్ని పాత్రలూ తలవంచాయంటే అతిశయోక్తి కాదు. భారతీయ సినీ వినీలాకాశంలో ఆమెది ఎన్నటికీ చెరిగిపోని అందం.. వెండితెరపై ఎప్పటికీ వన్నె తరగని అభినయం.. అందుకే.. ఆమె దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి అంటే.. అవును అంటూ అంగీకరించింది ప్రేక్షక లోకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement