Friday, November 22, 2024

‘శంభాజీ మహారాజ్’ పాత్రలో బిజెపి ఎమ్మెల్యే ‘రాజాసింగ్’

సినిమా నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లడం సర్వ సాధారణ విషయం. కానీ రాజకీయనాయకులు సినిమాల్లోకి రావడం అనేది వార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారున్న బిజీలో సినిమాల్లో నటించడం కష్టమయిన విషయమే. అందులోనూ అధికార పార్టీ బిజెపికి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. 2018తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్.  భారతీయ జనతా పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ఈయన. ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు సినిమాల్లో ఉంటాను అంటున్నాడు. నమ్మడానికి ఇది కాస్త చిత్రంగా ఉన్నా ఇదే నిజం గోషామహల్ ప్రజలకు అత్యంత ప్రియమైన నేత ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూనే.. ఒక గోరక్షకుడిగా గోవుల అక్రమ రవాణాపై తిరగబడుతున్నారు రాజా సింగ్. రియల్ లైఫ్ లో ఎన్నో పోరాటాలు చేసిన ఈయన ఇప్పుడు రీల్ లైఫ్ లోకి వస్తుండటం విశేషం.  శంభాజీ మహా రాజ్ జీవిత గాధ ఆధారంగా సినిమాను తీయనున్నారు. అందులో శంభాజీ పాత్రను పోషించబోతున్నాడు రాజా సింగ్. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని విశేషాలు చెబుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుమారుడు శంభాజీ గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఈయన శివాజీ కంటే ప్రమాదకరమైన నాయకుడు. శివాజీ మరణించిన తర్వాత .. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారు. శంభాజీ చరిత్ర చాలా బాగుంది. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని.. అందులో నేనే నటించాలని అనుకున్నానని చెప్పాడు రాజా సింగ్.  అంతేకాదు ఈ సినిమా కోసం తన బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గినట్లు చెప్పాడు. శంభాజీ పాత్ర కోసం.. అప్పట్లో ఆయన ఫిజిక్ ఎలా ఉండేదో అలాంటి బాడీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రాజా. తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీయనున్నట్లు చెప్పారు రాజా సింగ్. ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నామని రాజా సింగ్ చెప్పారు. నిర్మాత దొరికితే వెంటనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని.. ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని తెలిపారు. అందరి మాదిరి తన సినిమాలలో హీరోయిన్లతో పాటలు ఉండవని.. కామెడీ సన్నివేశాలు కనిపించవని.. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు.  ఇదిలా ఉంటే శంభాజీ రాజే భోంస్లే.. 1657, మే 14న జన్మించారు. ఈయన మరాఠా సామాజ్రానికి రెండో రాజు. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు శివాజీ, ఆయన మొదటి భార్య సాయి భోంస్లేకు పెద్ద కుమారుడు.. ఈ శంభాజీ. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. 1689, మార్చి 11న శంభాజీ మరణించారు. ఆయన 20 జులై, 1860 నుంచి 11 మార్చి, 1689 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. శంభాజీని మొగల్ చక్రవర్తులు కుట్రచేసి బంధించి.. చిత్రహింసలు పెట్టి చంపారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నీ అప్పగించి.. ఇస్లాంలోకి మారితే.. వదలిపెడతానని మొగల్ చక్రవర్తులు చెప్పారు. కానీ ఆయన ప్రాణం పోయినా ఇస్లాంలోకి మారనని స్పష్టం చేశారు. దాంతో శంభాజీని జైల్లో బంధించి.. చిత్రహింసలు పెట్టి.. చంపేసినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి వీరుడి బయోపిక్‌లో రాజాసింగ్ నటించనుండడంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement