Friday, November 22, 2024

విశాఖపట్నం : 5 దశాబ్దాల నాటి ఉద్యమం మళ్లీ ఉదృతం

ఏళ్ల క్రితం తెలుగునాట మార్మోగిన నినాదం విశాఖ ఉక్కు..ఆంధ్రుల ఇక్కు.  విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు కేంద్రం సిద్ధపడటంతో ఇప్పుడు మళ్లీ అంతే ఉదృతంగా, అంతే తీవ్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మార్మోగుతోంది .  హస్తిన సరిహద్దుల్లో రైతుల ఆందోళనలను మించి విశాఖ పరిరక్షణ కోసం ఆంధ్రులు కదం తొక్కేందుకు సిద్ధమౌతున్నారు. ఆనాడు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉమ్మడి ఏపీలో  తెలుగు ప్రజలందరూ విశాఖ ఉక్కు కోసం ఉద్యమించారు. ప్రాణ త్యాగాలకు కూడా వెరవలేదు.  ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా నాడు విద్యార్థి నాయకుడిగా ఉక్కు ఉద్యమంలో ముందుండి నడిచిన వారే.   గాంధేయవాది టి. అమృతరావు ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణత్యాగానికి సిద్ధపడి ఉక్కు సాధనలో కీలకంగా, ఉక్కు ఉద్యమానికి రూపశిల్పిగా, స్పూర్తిగా నిలిచారు.   కుల, మత, ప్రాంతం అన్న తేడా లేకుండా తెలుగు వారంతా నాటి పోరాటంలో భాగస్వాములయ్యారు. విశాఖలో ఉక్కు కర్మాగారానికి ససెమిరా అంటూ భీష్మించిన అప్పటి ప్రధాని  ఇందిరాగాంధీ మెడలు వంచి మరీ విశాఖ ఉక్కును సాధించుకున్నారు.  ఆ సాధించుకున్న  విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 40 గ్రామాల ప్రజలు 25 వేల ఎకరాల భూమిని ఇచ్చారు.   వారి అసమాన త్యాగాలతో ఏపీకి దక్కిన విశాఖను ఇప్పుడు మోడీ సర్కార్ తెగనమ్ముతానంటే అంగీకరించేందుకు సిద్ధంగా లేమంటూ యావదాంధ్రదేశమూ పిడికిలి బిగిస్తున్నాది. విశాఖ ఉక్కు కోసం ప్రాణ, ఆస్తి త్యాగం చేసిన వారి త్యాగాలను వృధా పోనివ్వమంటూ ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement