Tuesday, November 26, 2024

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ఉద్యమ ఊపిరి విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు  పైవేటీకరణకు నిరసనగా  కార్మికుల ఉద్యమ బాటకు   అఖిల పక్షాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్లాంట్‌ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ జెఎసిలు ఏర్పడ్డాయి.   స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ, స్వంత గనుల కేటాయింపు డిమాండ్ తో విశాఖ ఉక్కు ఉద్యమం ఉక్కు సంకల్పంతో రోజు రోజుకూ బలపడుతున్నది.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతోనాటి ఉద్యమం జన ఉప్పెనను తలపించినట్లుగానే నాడు పోరాడి సాధించుకున్న హక్కును, ఉక్కును పరిరక్షించుకోవడం కోసం ఇప్పుడు తలపెట్టిన ఉద్యమం మరింత మహోద్రుతంగా ఉంటుందని కార్మిక లోకం చెబుతోంది.  రూ.4,900 కోట్లతో ప్రారంభమైన ఉక్కు కర్మాగారం  ‌ రూ.40వేల కోట్లకుపైగా పన్నులు, డివిడెండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు చెల్లించింది.  ఆంధ్రుల జీవనాడి ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆంధ్రుల అత్మాభిమానాన్ని దెబ్బకొట్టడమేనని యావత్ ఆంధ్రజాతి భావిస్తున్నది.  జాతి మొత్తం ఒక ఉద్వేగంతో, ఉద్రేకంతో ఊగిపోతున్నది. ఎందరో ప్రాణత్యాగంతో, అసమాన త్యాగాలతో ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కేవలం సొమ్ముల కోసం అమ్మేస్తాననడం దుర్మార్గమన్న భావన ఆంధ్రులలో వ్యక్తమౌతున్నది. ఆర్థిక సంక్షోభం నుంచి విశాఖ ఉక్కును బయటపడేయాలంటే కేంద్రం  ఎన్‌ఎండిసి, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విలీనం చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సొంత గనులు లేకుండా ఏ ప్రేవేటు సంస్థా కూడా స్టీల్ ప్లాంట్ ను నిర్వహించడం సాధ్యం కాదని కూడా వారు చెబుతున్నారు.  అయితే ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలు ఇదే మొదటి సారేమీ కాదు.  . విశాఖ ఉక్కు ఎందరో తమ ప్రాణాలను  బలిదానం చేస్తే వచ్చింది.  ప్రాణాలర్పించి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేయడాన్ని ఆంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళతామంటూ నినదిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement