భారత్‌లో జరుగుతున్న రైతు నిరసనలు, పత్రికా స్వేచ్ఛ అంశాలపై బ్రిటీష్ పార్లమెంట్‌లో చర్చ చేపట్టారు. అయితే బ్రిటన్ ఎంపీలు ఈ అంశాలపై చేపట్టిన చర్చను లండన్‌లో ఉన్న భారతీయ హై కమీషన్ తప్పుపట్టింది. చర్చ సరైన రీతిలో సమతుల్యంగా జరగలేదని, తప్పుడు ఆరోపణలతో చర్చించారని, తమ వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై అనుచిత ఆరోపణలు చేస్తున్నారని, భారత వ్యవస్థలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని హై కమీషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
సోమవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్ సుమారు 90 నిమిషాలు భారత్‌లో రైతు నిరసనలపై చర్చించింది. అలాగే ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడం అంశాన్ని కూడా చర్చించారు. బ్రిటన్‌లోనూ నిరసనలు జరిగినప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందుతుంటాయని, అంటే దాని అర్థం ప్రజాస్వామ్యానికి బ్రిటన్ వ్యతిరేకం కాదు అని కన్జర్వేటివ్ ఎంపీ థెరిసా విల్లియర్స్ తెలిపారు. బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన చర్చ గురించి లండన్‌లోని భారతీయ హై కమిషన్ తన ప్రకటనలో ప్రస్తావిస్తూ.. భారత్‌తో మైత్రి కలిగి ఉన్న దేశాలు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేసినా.. ఆ అంశాలను సరిచేయడం తమ కర్తవ్యమని పేర్కొన్నది. త్వరలో ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని కలుసుకుంటారని, ఆ సమయంలో రైతు నిరసనల అంశాన్ని లేవనెత్తుతామని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.