ఐఐటీ గౌహతిలో సహచర విద్యార్థినిపై ఓ బీటెక్ స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి ఇటీవల గౌహతి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు, నిందితుడు ఉన్నత విద్యావంతులుగా సమాజంలోకి అడుగుపెట్టనున్నారని వారు రాష్ట్రానికి భవిష్యత్ ఆస్తులని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే కోర్టు చేసిన వ్యాఖ్యలపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనను రేప్ చేసిన వాడు భవిష్యత్ ఆస్తి ఎలా అవుతాడని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని బాధితురాలు ఆరోపించింది.
అతడు ఐఐటీ స్టూడెంట్ అని కోర్టు భావిస్తే.. తాను కూడా ఐఐటీ స్టూడెంట్‌నే అని కోర్టు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికింది. తన లాంటి వారు మరింత మంది అన్యాయానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టును నిలదీసింది. కాగా మార్చి 28 రాత్రి యువతిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు బాలికను కాపాడి వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని ఏప్రిల్ 3న అరెస్ట్ చేశారు.