బెంగుళూరులో జొమాటో డెలివరీ బాయ్ ఒకడు చేసిన దాడిలో ఓ యువతి గాయపడింది. చంద్రానీ అనే యువతి తాను ఆర్డర్ ఇచ్చి ఎంత సేపయినా రాకపోవడంతో కస్టమర్ కేర్ కి, జొమాటో ఎగ్జిక్యూటివ్ కి ఫోన్ చేసి ఇక మీ ఫుడ్ వద్దని, ఇస్తే ఫ్రీగా ఇవ్వాలని, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని హెచ్ఛరించింది. అయితే చాలా సేపటికి వచ్చిన డెలివరీ బాయ్ పై చంద్రానీ సీరియస్ అయింది. తర్వాత ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన సదరు డెలివరీ బాయ్ ఆ యువతి ముఖం పై పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఎటాక్ లో ఆమె ముక్కునుంచి రక్తం కారి తీవ్రంగా గాయపడింది.
తనపై జొమాటో డెలివరీ బాయ్ దాడికి పాల్పడ్డాడని తన అనుభవాన్ని వివరిస్తూ ఆ యువతి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని ఆమె కన్నీటితో నెటిజన్లను అభ్యర్థించారు.
ఇక బాధితురాలి ఫిర్యాదుతో జొమాటో యాజమాన్యం ఆమెకు క్షమాపణ చెప్పడమే గాక ఆ డెలివరీ బాయ్ పేరును యాప్ నుంచి తొలగించినట్లు తెలిపింది, మీమెడికల్ కేర్ కు, ఈ ఘటనపై దర్యాప్తునకు సహకరిస్తామని ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. చంద్రానీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో బెంగుళూరు పోలీసులు ఆ డెలివరీ బాయ్ పై కేసు పెట్టి అరెస్టు చేశారు.