Sunday, November 24, 2024

మంచినీటికీ కార్పొ‘రేటు’

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • మినరల్‌ వాటర్‌ పరిశ్రమలోకి అంతర్జాతీయ కంపెనీలు
  • లాభనష్టాల బేరీజుకు అనుగుణంగా వ్యాపారం
  • కొరవడిన ప్రభుత్వ అజమాయిషీ
  • పెట్రోల్‌ తరహాలో ధరల సవరణ
  • ఇప్పటికే కిన్‌లే లీటర్‌ రూ.40లు
  • భారీగా విస్తరించనున్న వ్యాపారం
  • కార్పొరేటుకే మంచి నీళ్లు
  • భూగర్భజలాలు, తాగునీటిని పరిరక్షించుకోవాలి
  • సామాజిక నిపుణుల సూచనలు

దేశంలో పెట్రోల్‌, డీజెల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో పెట్రోల్‌ ధర లీటర్‌ వంద రూపాయలకు చేరింది. మరో ఆరుమాసాల్లో ఇది లీటర్‌ రెండొందలకు చేరే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. ఈ ధరల పెరుగుదల కేవలం పెట్రోల్‌కే కాదు.. మంచి నీటికి కూడా వర్తించే ప్రమాదాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాన్రాను భూగర్భజలాలు కలుషితమై పోతున్నాయి. విషతుల్యంగా మారు తున్నాయి. వీటిని నేరుగా వినియోగించడం ప్రాణాలకు హానికరమౌతుంది. కలుషిత నీటిని తాగడం ద్వారా పలు అవయవాలు దెబ్బతింటు న్నాయి. ఇది మరణానికి దారితీస్తోంది. దీంతో జనం అంచెలంచెలుగా మినరల్‌ వాటర్‌ వైపు అలవాటు పడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితమే భారత్‌లో మినరల్‌ వాటర్‌ పరిశ్రమ వేళ్ళూనుకుంది. అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఈ రంగంలోకి కార్పొరేట్లు ప్రవేశించాయి. కోకో కోలా వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మినరల్‌ నీటి సీసాల విక్రయాన్ని ప్రధాన వ్యాపారంగా మార్చుకున్నాయి. రాన్రాను ఇతర పరిశ్రమల తరహాలోనే మినరల్‌ వాటర్‌ పరిశ్రమ కూడా పూర్తిగా కార్పొరేట్ల హస్తగతమయ్యే అవకాశం కలిపిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజెల్‌ వంటి ఉత్పత్తులు పరోక్షంగా కార్పొరేట్ల ఆధిపత్యంలోకెళ్ళాయి. పెట్రోలియం బావులు కార్పొరేట్ల గుప్పెట చిక్కుకున్నాయి. పెట్రోలియం శుద్ధి, తయారీ, పంపిణీ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడుల్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్‌లో ఇవన్నీ ప్రైవేటు కార్పొరేట్‌ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఈ ఉత్పత్తులపై ప్రభుత్వ అజమాయిషీ పూర్తిగా కొరవడుతోంది. కేవలం లాభనష్టాల బేరీజుకు అనుగుణంగానే వ్యాపారం సాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ఒడిదుడుకుల్ని ఆసరాగా చేసుకుని స్థానికంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని అనూహ్యంగా పెంచేస్తారు. ఇప్పుడీ సంస్థలు మినరల్‌ వాటర్‌ వ్యాపారాన్ని కూడా గుప్పెట పట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న చిన్నా చితకా ప్రైవేటు మినరల్‌ కంపెనీలేవీ ఐఎస్‌ఐ నిబంధనల్ని పాటించడంలేదు. ఆ స్థాయిలో ఉత్పత్తుల్ని నిర్వహించడం లేదు. కార్పొరేట్‌ ఐఎస్‌ఐ ఆధారంగా ఈ వ్యాపారాన్ని గుప్పెటపట్టే వ్యూహాలు సిద్ధం చేశాయి. మినరల్‌ వాటర్‌ విక్రయాలకు ఐఎస్‌ఐ నిబంధనలు తప్పవని కేంద్రం ధ్రువీకరిస్తే చిన్న తరహా పరిశ్రమలన్నీ మూతబడతాయి. ఆ స్థాయిలో నిబంధనల్ని పాటిస్తూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయగలిగే కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి ఈ వ్యాపారం మొత్తం వెళ్తుంది. పెట్రోల్‌ ధరలో సగం ధరపై శుద్ధి చేసిన మంచినీటిని వినియోగదార్లకు అందించాలన్నది వీటి సంకల్పంగా మారింది. ఇప్పటికే కోకోకోలా ఉత్పత్తయిన కిన్‌లే లీటర్‌ సీసాల్ని ఓ మాదిరి హోటళ్ళలో లీటర్‌ 40రూపాయలకు అమ్ముతున్నారు. ఇది అంచెలంచెలుగా 60 నుంచి 70రూపాయలకు ఎగబాకే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో పెట్రోల్‌, డీజెల్‌ ధరలకు అనుగుణంగానే మినరల్‌ వాటర్‌ ధరలు కూడా సవరణలకు గురవుతుంటాయని వ్యాపార నిపుణులు అంచనాలేస్తున్నారు.
భారత్‌లో 50శాతం మందికిపైగా సురక్షిత నీటిని తాగలేక పోతున్నారు. దీంతో ప్రతి ఏటా కేవలం కాలుష్య జలాల కారణంగానే 2లక్షల మంది మరణిస్తున్నారు. దేశం ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన జాతీయ నీటి సంక్షోభంతో బాధపడుతోంది. ఇది ప్రపంచ నీరు మరియు పారిశుద్ధ్య సంక్షోభానికి కేంద్రంగా పరిగణించబడుతోంది. సుమారు 82శాతం గ్రామీణ కుటుంబాలు సురక్షిత నీటిని అందుకోలేక పోతున్నాయి. గ్రామాల్లో తరచూ చేతులు కడుక్కోవడం ఓ విలాస వంతమైన అలవాటుగా పరిగణించ బడుతోంది. నీతి ఆయోగ్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అధ్యయనం భారత్‌లో ప్రస్తుతం అతిపెద్ద నీటి సంక్షోభం ఉందని స్పష్టం చేసింది. ఇదిలాగే కొనసాగితే 2050నాటికి భారత స్థూల జాతీయోత్పత్తిలో ఆరుశాతం దిగజారే ప్రమాదాన్ని శంకించింది. నీటి డిమాండ్‌ 2020నాటికే సరఫరాను మించిపోయింది. 2030నాటికి ఇది దాదాపు రెట్టింపు అవుతుంది. జనాభాలో 40శాతం మందికి 2030నాటికి తాగునీరు అందుబాటులో ఉండదు. ఏటా 19.60లక్షల గృహాల్లోని కుటుంబీకులు రసాయనాలు, విషవ్యర్థాలతో కూడిన నీటి కారణంగా అనారోగ్యాల పాలౌతున్నారు. ఏటా వీరిపై 600మిలియన్‌ డాలర్ల ఆర్థిక భారం పడుతోందని యునిసెఫ్‌ అధ్యయనం స్పష్టంచేసింది. పట్టణ ప్రాంతాల్లో సగం మందికి సురక్షితమైన నీరు అందుబాటులో ఉండడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో వారానికి మూడ్రోజుల పాటు అది కూడా రోజుకు మూడుగంటల చొప్పున మాత్రమే తాగునీటిని అందించగలుగుతున్నారు. పెరుగుతున్న నీటి సంక్షోభ పరిష్కారానికి ఉన్నత, మధ్యతరగతి జనాభా ఇప్పటికే మినరల్‌ వాటర్‌ వైపు మళ్ళింది. ఇప్పుడిప్పుడే క్రిందిస్థాయి కుటుంబాలు కూడా మినరల్‌ వాటర్‌ మాత్రమే వినియోగించే అలవాటుకు మళ్ళుతున్నారు. దీన్ని కార్పొరేట్‌ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. భవిష్యత్‌లో మినరల్‌ వాటర్‌ వ్యాపారం అతిపెద్దగా విస్తరించనుంది. పెట్రోల్‌, డీజెల్‌తో సమానంగా మినరల్‌ వాటర్‌ విక్రయాలు సాగనున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల్లాగే మినరల్‌ వాటర్‌ కూడా కార్పొరేట్ల ఆధిపత్యంలో వారు నిర్దేశించిన ధరలకు అనుగుణంగానే మార్కెట్లో లభించనుంది. భూగర్భ జలాలు, తాగునీటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. కానీ సాధారణ జనంలో నీటి పొదుపు పట్ల అవగాహన లేదు. ఉన్నా నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఇష్టారాజ్యంగా తాగునీటిని వృధా చేస్తున్నారు. భవిష్యత్‌ అవసరాల్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. ప్రస్తుత అవసరాలకు మించి నీటిని వాడేస్తున్నారు. వీరంతా భావితరాలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement