ఒకప్పుడు ప్రసవం అంటే సుఖప్రసవం. నూటికి 99 శాతం నార్మల్ డెలివరీలు జరిగిపోయేది. కానీ ఇప్పుడు ప్రసవం అంటే సిజేరియన్. నూటికి 99 శాతం సిజేరియన్లే. అప్పట్లో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని అదేదో చిత్రంగా మాట్లాడుకుంటే.. నార్మల్ డెలివరీ జరిగిందా గొప్ప విషయమే అని ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి కారణాలు ఎన్నంటే అబ్బో చాలానే ఉంటాయి. అందరూ అని చెప్పలేం కానీ డాక్టర్లే ఇప్పుడు సిజేరియన్ చేయించుకోండి టెన్షన్ ఉండదని చెప్పి మరీ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకోకతప్పదు. ఆమ్మో మా పిల్ల నొప్పి భరించలేదు ఆపరేషన్ చేయండి అనే పెద్దలు.. టైం మేము చెబుతాం.. మీరు ఆ టైంకి బిడ్డను బయటకి తీయండి అని జాతకాలను తిరగరాసుకోవాలనే పిచ్చోళ్ళతో పాటు సిజేరియన్ చేస్తే నాలుగు డబ్బులొస్తాయనే డాక్టర్లు కలిసి ఇప్పుడు బిడ్డను కనడం అంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం ఒక్కటే అనేలా మార్చేశారు. కానీ ఇప్పటికీ ఒక పెద్దావిడ నూటికి 99 శాతం నార్మల్ డెలివరీలు చేయడమే భాగ్యంగా భావిస్తున్నారు. పైసా తీసుకోకుండా పురుడుపోసి సుఖప్రసవం అయ్యేలా చేసి పెద్ద పెద్ద చదువులు చదివిన వైద్యులకే ఒక పాఠంగా మారిపోయారు. సూలగుత్తి నరసమ్మ. 97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం ఎటువంటి వైద్య సదుపాయాలు లేని వెనుకబడిన కొండ ప్రాంతంలో ప్రకృతి వైద్యం చేస్తున్నారు. కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలరంటే ఈ పెద్దమ్మ స్పెషాలిటీ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతారు. తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది.. తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు వంటి విషయాలు ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే ఖచ్చితంగా చెబుతుండడంతో బెంగుళూరులోని అనేక మల్టీ/సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా మారిపోయారు. నూటికో కోటికో అన్న చందంగా సిజేరియన్ తప్పనిసరి అనుకుంటే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారించడం ఈ నరసమ్మకే చెల్లింది. సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. నిరుపేద కుటుంబంలో జన్మించిన నరసమ్మ.. తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసి మంచి హస్తవాసి గల మంత్రసానిగా పేరుతెచ్చకున్నారు. ఇంతచేసినా ఎవరి దగ్గరా పైసా తీసుకోరు. ఎవరైనా తనకు డబ్బులు, బహుమతులు పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వెళ్లి తిరిగి వారికి ఇచ్చేసి కృతజ్ఞత చెప్పేస్తారట. వేలమందికి కాన్పులు చేసిన నరసమ్మ చివరి వరకూ వ్యవసాయ కూలీగా బ్రతికారు. టుంకూర్ యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా వందల మంది డాక్టర్లకు ఆమె నిఘంటువుగా చెప్పుకోవాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement