Friday, November 22, 2024

బిర్యానీ పొట్లంలో ముక్కుపుడకలు పంచుతూ ఓటర్లకు గాలం

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలువురు అభ్యర్థులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. నంద్యాలలో 12వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తూ దొరికిపోయాడు. ఖండే శ్యామసుందర్‌లాల్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఓటర్లను ఆకర్షించి ఓట్లు దండుకోవడానికి బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు.

పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కొందరిని కిరాయికి పిలిపించుకుని శ్యామసుందర్ మంగళవారం నాడు బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి వారితో పంపిణీ చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement